అల్లూరిని స్మరించుకోవడం అదృష్టం

Kishan Reddy Comments about Alluri Seetharamaraju Vardhanthi - Sakshi

ఏడాది పాటు అల్లూరి జయంత్యుత్సవాలు

రూ.35 కోట్లతో మ్యూజియం

అల్లూరి వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సీతమ్మధార (విశాఖ ఉత్తర): అల్లూరిని స్మరించుకోవడం మన అదృష్టమని, దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అలాగే అల్లూరితో కలసి బ్రిటీష్‌ వారితో పోరాటం చేసిన కుటుంబాలను గుర్తించి.. వారి వారసుల పిల్లలకు ప్రైవేట్‌ సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.

లంబసింగిలో రూ.35 కోట్లతో అల్లూరి మ్యూజియంను ఏడాదిలోపు ఏర్పాటు చేస్తామన్నారు. సీతమ్మధార క్షత్రియ కల్యాణమండపంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిషన్‌రెడ్డి హాజరై అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ అల్లూరి 125వ జయంత్యుత్సవాలను ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు దేశ వ్యాప్తంగా ఏడాదిపాటు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలకు గుర్తుండేలా స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. సీఎం జగన్‌ రాష్ట్రంలోని ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయడం ఆయనకు ఇచ్చిన గౌరవమన్నారు.

అల్లూరి తిరిగిన ప్రాంతాలను టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్, నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వరుదు కల్యాణి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.

రావాల్సిన నిధులివ్వండి : మంత్రి రోజా
మహారాణిపేట: రాష్ట్రంలో పర్యాటక రంగానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని మంత్రి ఆర్‌కే రోజా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. శనివారం పోర్టు గెస్టు హౌస్‌లో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రోజా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పిలిగ్రిమ్స్, హెరిటేజ్‌ డెస్టినేషన్‌ మ్యూజియం గ్రాంట్స్‌ మంజూరు చేయాలని కోరుతూ.. డీపీఆర్‌లను కేంద్ర మంత్రికి అందజేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top