ఇప్పటికే తొలి దశలో 10 ఎకరాలు విక్రయం
అడ్వెంచర్ థ్రిల్ సిటీ పేరుతో విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్.. విశ్వనాథ్ అవెన్యూస్ సంస్థలకు కట్టబెట్టిన వైనం
మాజీ మంత్రి గంటా సన్నిహితులవే ఈ సంస్థలు
సర్వే నంబర్ కూడా లేకుండా జీవో ఇచ్చిన బాబు సర్కార్
రూ.4,600 కోట్ల విలువైన 230 ఎకరాల భూములు కొల్లగొట్టేందుకు పన్నాగం
సాక్షి, అమరావతి: కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి రమణీయత మధ్య హాయిగా ఆహ్లాదాన్ని పంచే కీలక పర్యాటక ప్రాజెక్టు ‘భవానీ ద్వీపం’పై చంద్రబాబు సర్కార్ కన్నుపడింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత దాదాపు 230 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రకృతి స్వర్గధామం విలువ అక్షరాలా రూ.4,600 కోట్లు! ఇప్పటికే కృష్ణా నదికి అటు వైపు రాజధాని ప్రాంతం అమరావతిలో వేల ఎకరాలు బినామీల పేరుతో కొల్లగొట్టిన ఎల్లో గ్యాంగ్.. నది నడి మధ్యలో ఉన్న భవానీ ద్వీపాన్ని కూడా చెరబట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
అందుకు సీఎం చంద్రబాబు తనకు అలవాటైన పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానాన్ని పక్కా పన్నాగంతో తెరపైకి తెచ్చారు. ఆ విధానం ముసుగులో తన బినావీులకు భవానీ ద్వీపాన్ని ధారాదత్తం చేసేందుకు కుతంత్రాన్ని వేగవంతం చేశారు. మార్కెట్ అంచనాల ప్రకారం భవానీ ద్వీపంలో ఎకరా భూమి విలువ పుష్కరకాలం కిందటే రూ.4 కోట్లకుపైగా ఉంది.
ప్రస్తుతం రాజధాని నేపథ్యంలో ఎకరం రూ.20 కోట్లు పైగా పలుకుతోంది. ఈ లెక్కన రూ.4,600 కోట్లు చేస్తుంది. ఇంతటి ఖరీదైన భూమిని చంద్రబాబు ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడికి అప్పనంగా దోచి పెడుతోంది.

సూత్రధారి బాబు.. నారాయణ, గంటా పాత్రధారులు
గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం.. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష అసోసియేట్స్ ఫిషింగ్ లిమిటెడ్ మౌలిక సదుపాయాలు–పెట్టుబడుల సంస్థకు భవానీ ద్వీపాన్ని 55 ఏళ్ల పాటు లీజు రూపంలో కట్టబెట్టేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని నాటి ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్‌సీపీతోపాటు టీడీపీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పెద్దే సూత్రధారిగా.. నాటి పాత్రధారులను తెరపైకి తెచ్చి ఈ భారీ భూ దోపిడీకి కుతంత్రం రచించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమరావతిలో తన దోపిడీ భాగస్వామి మంత్రి నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ద్వారానే కథ నడిపిస్తుండటం గమనార్హం. గంటా శ్రీనివాసరావు బినామీగా గుర్తింపు పొందిన కాశీ విశ్వనాథ్‌కు చెందిన విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేటు లిమిటెడ్, విశ్వనాథ్ అవెన్యూస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను తెరపైకి తెచ్చింది. ఆ సంస్థలకు ’అడ్వెంచర్ థ్రిల్ సిటీ’ పేరుతో భవానీ ద్వీపాన్ని దశల వారీగా కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది.
ఇప్పటికే పది ఎకరాలను కట్టబెడుతూ కనీసం సర్వే నంబర్లు కూడా లేకుండా ఈ నెల 13వ తేదీన జీవో జారీ చేయడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. అంతేకాకుండా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు కట్టబెట్టడం ప్రభుత్వ బరితెగింపును బట్టబయలు చేస్తోంది. కాశీ విశ్వనాథ్ కేవలం ముసుగు అన్నది బహిరంగ రహస్యం.
నిర్లక్ష్యం మాటున కబ్జా కుట్ర!
ప్రపంచంలోనే మంచి నీటి సముదాయ ద్వీపంగా విశేష గుర్తింపు పొందిన భవానీ ద్వీపాన్ని కొల్లగొట్టడం కోసమే చంద్రబాబు ప్రభుత్వం దానిని పర్యాటకపరంగా అభివృద్ధి చేయకుండా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న భవానీ ద్వీపంలో కనీస మౌలిక సదుపాయాలను పునరుద్ధరించనే లేదు.
230 ఎకరాల్లో భవానీ ద్వీపం భూములను నోటిఫై చేయగా, 30 ఎకరాల్లో భవానీ ఐలాండ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (బీఐటీసీ) ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో ఏపీటీడీసీకి చెందిన 45 గదుల కాటేజీల ద్వారా ఆతిథ్య సేవలను అందిస్తోంది.
ఈ క్రమంలో ఇంద్రకీలాద్రి కింద ఉన్న అత్యంత విలువైన, ఏపీటీడీసీకి కీలక ఆదాయ వనరుగా ఉన్న బెరంపార్కు హోటల్‌తో పాటు ద్వీపంలోని 45 గదులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ టెండర్ ప్రక్రియ ముగిసి ప్రైవేటు వ్యక్తులకు వీటిని కట్టబెడితే.. అదే బెరంపార్కులో నుంచి భవానీ ద్వీపానికి వెళ్లే మార్గంలో సామాన్యులు అడుగు పెట్టలేని దుస్థితి దాపురిస్తుంది.
గత ప్రభుత్వంలో పర్యాటక వెలుగులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24లో భవానీ ద్వీపాన్ని రాజధాని ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిది్దంది. పర్యాటక శాఖ ద్వారానే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. దాంతో సందర్శకుల ద్వారా భారీగా పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. 2022–23లో రికార్డు స్థాయిలో రూ.3.13 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2023–24లో రూ.4 కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వంలోనే దుర్గగుడి సమీపం నుంచి భవానీ ద్వీపానికి రోప్‌వే కూడా మంజూరైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం పడిపోయింది.
4 వేల ఎకరాల్లో ద్వీప సముదాయం!
కృష్ణానదిలో భవానీ ద్వీపంతో పాటు గుంటూరు జిల్లాలోనూ విస్తరించిన ద్వీప సముదాయాలన్నీ కలిపితే సుమారు 4 వేల ఎకరాలు ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇందులో 700 ఎకరాల భూమిని అనువైనదిగా గుర్తించి వినియోగంలోకి తీసుకొచ్చేలా కాన్సెప్ట్ ప్లాన్‌ను రూపొందించింది.
వాటిని నాలుగు జోన్లుగా విభజించి ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిని అప్పట్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు తాజాగా పర్యాటక ప్రాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 3,913.96 ఎకరాల పర్యాటక భూములను నోటిఫై చేసి.. అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టేలా కుట్రలు చేస్తోంది.


