ఏఐ రాకతో కీలక పరిణామాలు
10 రంగాల్లో 3.60 కోట్ల ఉద్యోగాలు కోత
కొత్త రంగాల్లో 4 కోట్ల ఉద్యోగాల కల్పన
మెక్ కిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పెనుమార్పులకు నాంది పలకనుంది. రానున్న దశాబ్దంలో ఉద్యోగ అవకాశాలను విప్లవాత్మక రీతిలో ప్రభావితం చేయనుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యోగాల అవసరం భారీగా తగ్గిపోనుంది. అదే సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలకు తలుపులు తెరచుకుంటున్నాయి.
వెరసి శరవేగంగా మారుతున్న సమాచార, సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే ఉద్యోగ భరోసా అన్నది స్పష్టమవుతోందని అమెరికాలోని ప్రముఖ సాంకేతిక సంస్థ ‘మెక్ కిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్’ కుండబద్దలు కొట్టింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఏఐ ప్రభావంపై ఆ సంస్థ అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 రంగాల్లో 3.60 కోట్ల ఉద్యోగాలకు కోత పడనుందని ఆ నివేదిక వెల్లడించింది. కొత్తగా 4 కోట్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మార్కెట్‌లోకి వస్తాయని భరోసా ఇచ్చింది.
నివేదిక ఏం చెబుతోందంటే..
» ఏఐ, ఆటోమేషన్ టూల్స్ విస్తృతితో రానున్న పదేళ్లలో 21 శాతం ఉద్యోగాలకు కోత పడుతుంది.
» దశాబ్దాలుగా కొనసాగుతున్న వాటిలో దాదాపు 3.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఇక ఉండదు. వీరు ఇతర ఉద్యోగ, ఉపాధి రంగాలకు మారాల్సి ఉంటుంది.
» 2.5 కోట్ల ఉద్యోగులు మాత్రం నైపుణ్యాలను మెరుగుపర్చుకుని తమ ఉద్యోగాల్లో కొనసాగుతారు.
» ఏఐ ప్రభావంతో కొత్తగా 4 కోట్ల ఉద్యోగాలు ఏర్పడతాయి. ఇప్పటివరకు లేని కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
» అంటే, ఏఐ ఉన్న ఉద్యోగాలను తుడిచిపెట్టేయడం కంటే.. ఉన్నవాటి కంటే ఎక్కువ ఉద్యోగాలనే సృష్టిస్తుంది.
» ఏఐ వల్ల ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, రిటైల్ సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లోని కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతారు.
» ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్), నిర్వహణ, నిర్మాణం (మేన్‌జ్‌మెంట్, కనస్ట్రక్షన్), సాంకేతిక (టెక్నాలజీ) విభాగాల్లో ఉద్యోగాల డిమాండ్ భారీగా పెరుగుతుంది.


