దళిత మహిళ లాకప్ డెత్‌పై ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం తీసుకోండి | Key development in Gangammas death case | Sakshi
Sakshi News home page

దళిత మహిళ లాకప్ డెత్‌పై ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం తీసుకోండి

Jun 21 2026 3:48 AM | Updated on Jun 21 2026 5:30 AM

Key development in Gangammas death case

మేజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశం.. గంగమ్మ మృతి కేసులో కీలక పరిణామం

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రత్యక్ష సాక్షి బేగరి దుర్గప్ప 

దీంతో స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు 

వాంగ్మూలం నివేదికను ఈ నెల 23న తమ ముందుంచాలని మేజిస్ట్రేట్‌కు స్పష్టీకరణ 

కుమారుడి అదృశ్యం కేసులో గంగమ్మను సిట్‌ పోలీసులు లాకప్‌డెత్‌ చేశారంటూ పిటిషన్‌ 

ఈ కేసులో దుర్గప్పను సైతం తీవ్రంగా టార్చర్‌ చేశారని హైకోర్టుకు నివేదన 

దుర్గప్ప చనిపోక ముందే అతని వాంగ్మూలం నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థన 

సానుకూలంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనం 

సాక్షి, అమరావతి: దళిత మహిళ మాల గంగమ్మ లాకప్‌డెత్‌  కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఈ వ్యవహారానికి సంబంధించి ప్రాణా పాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగరి దుర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సంబంధిత జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ దుర్గప్ప ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయితే అతన్ని వెంటనే సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. నమోదు చేసిన వాంగ్మూలాన్ని ఈ నెల 23న తమ ముందుంచాలని మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. 

ఈ కేసుకు సంబంధించిన రిట్‌ పిటిషన్‌ కాపీతో పాటు ఈ ఆదేశాల కాపీని సంబంధిత మేజిస్ట్రేట్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.  కాసుకుర్తి ఆగమన్‌రాజ్‌  అనే యువకుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన  ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  

కొడుకు ఆచూకీ కావాలన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది 
కర్నూలు జిల్లా, కౌతాళం మండలం, బదినేహాల్‌ గ్రామానికి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.  దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వీరేంద్ర అదృశ్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్‌పీ (క్రైమ్స్‌) కె.సుప్రజ నేతృత్వంలో మొత్తం 13 మందితో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మే 8న డీజీపీ ఉత్తర్వులిచ్చారు.

వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సుప్రజ నేతృత్వంలోని సిట్‌ మాల గంగమ్మను, బేగరి దుర్గప్పను కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా హింసించారన్నది ప్రధాన విమర్శ.  దీని ప్రకారం  సిట్‌ టార్చర్‌ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న దుర్గప్పను కర్నూలు ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. ఇక గంగమ్మ లాకప్‌డెత్‌ వ్యవహారం తమ మీదకు రాకుండా ఉండేందుకు పోలీసులు గంగమ్మ కుమార్తె లక్ష్మిని భయపెట్టి ఆమె చేత ఓ తప్పుడు ఫిర్యాదు చేయించారు. తన తల్లి గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిందని, అయితే ఆమె మరణానికి కారణాలను తెలుసుకోవాలని మే 31న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లక్ష్మి పేర్కొన్నారు. 

తన తల్లి లోబీపీ, విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్న లక్ష్మి, ఫిర్యాదు చివరి లైనులో మాత్రం అనారోగ్యంతో కాక మరేదైనా కారణంతో మరణించారో తెలియడం లేదని పేర్కొంది. అనారోగ్యంతో కుటుంబ సభ్యులు మరణిస్తే దానిపై సాధారణంగా ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయరు. అయితే లక్ష్మి  మాత్రం తల్లి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో గంగమ్మ లాకప్‌డెత్‌ వ్యవహారం మరుగున పడిపోయింది. సిట్‌ అధికారులందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే విజయవాడకు చెందిన సాయికృష్ణ లాకప్‌డెత్‌ నేపథ్యంలో గంగమ్మ లాకప్‌డెత్‌ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. 

పిల్‌తో వెలుగుచూసిన పోలీసుల దాష్టీకం! 
ప్రాణాపాయ స్థితిలో ఉన్న దుర్గప్ప మరణిస్తే గంగమ్మ లాకప్‌డెత్‌ వ్యవహారం మరుగునపడి పోయే ప్రమాదం ఉందని భావించిన కాసుకుర్తి ఆగమన్‌రాజ్‌ అనే యువకుడు  ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. దుర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిల్‌ దాఖలు చేశారు. పోలీసుల టార్చర్‌కు గంగమ్మ మృతి చెందగా, దుర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారని తెలిపారు. పోలీసులు మాత్రం బైక్‌పై నుంచి పడిపోవడం వల్ల దుర్గప్పకు గాయాలయ్యాయని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారని వివరించారు. 

గంగమ్మను కస్టడీలో పోలీసులు హింసించారా లేదా అనేదానికి ఆ సమయంలో అక్కడే ఉన్న  దుర్గప్ప ఏకైక  కీలక సాక్షి అని, అతను కూడా చనిపోతే ఈ కేసులో కీలకమైన సాక్ష్యం లేకుండా పోతుందని వివరించారు. కాగా, దుర్గప్ప మోటారుసైకిల్‌ నుంచి పడటం వల్ల గాయపడ్డారని రిమాండ్‌ రిపోర్ట్‌ పేర్కొంటుంటే.. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది  సింగమనేని ప్రణతి మాత్రం దుర్గప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని ధర్మాసనం ముందు పేర్కొనడం గమనార్హం.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement