Women Drop At Home Service: ఉండమ్మా తోడొస్తా.. ‘వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ పేరిట వినూత్న సేవలు

Kakinada Police Explain Need Of Women Drop Home Services - Sakshi

మహిళల భద్రతలో కీలక ముందడుగు

రాత్రి వేళల్లో అతివలను క్షేమంగా గమ్యానికి చేర్చనున్న పోలీసులు

ప్రత్యేక వాహనం ఏర్పాటు

తొలిగా కాకినాడలో..

తరువాత మిగిలిన పట్టణాలకూ విస్తరణ  

కాకినాడ: మహిళల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దిశ బిల్లు, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌ వంటి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇదే స్ఫూర్తితో జిల్లా పోలీసు శాఖ మహిళల రక్షణకు సంబంధించి కీలకమైన ముందడుగు వేసింది. రాత్రి వేళల్లో గమ్యస్థానాలకు చేరే మహిళల భద్రతకు మరింత భరోసా ఇస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ పేరుతో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది.

చదవండి: Snow Park: రాష్ట్రంలో ఇదే తొలిసారి.. విశాఖలో ‘స్నోపార్క్‌’ ఏర్పాటుకు సన్నాహాలు

దీని ద్వారా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన మహిళలను వారి గమ్యస్థానాలకు పోలీసులే చేరుస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాహనం ఏర్పాటు చేశారు. సాధారణ మహిళలతో పాటు, విద్యార్థినులు, ఉద్యోగం చేసే వారు, అనుకోని ఆపదలో చిక్కుకునే వారు, జనసంచారం లేని ప్రాంతాలు, చీకటి రహదారుల్లో ప్రయాణించాల్సిన వారు, నగర శివార్లకు చేరాలనుకునేవారు, కార్యాలయాలు, విద్యాలయాల్లో అధిక సమయం గడపాల్సిన సందర్భాలు ఎదురైనప్పుడు, వసతి గృహాలు, హోమ్‌లలో ఉంటున్న మహిళలు తమ అవసరాన్ని బట్టి ‘వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ సేవలను వినియోగించుకోవచ్చు.

తద్వారా వారికి ఈవ్‌ టీజర్లు, ఆకతాయిలు, నేర స్వభావం ఉన్న ఆటో డ్రైవర్లు, రౌడీలు తదితరుల నుంచి రక్షణ లభిస్తుంది. పూర్తి ఉచితంగా అందించే ఈ సేవలకు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు శ్రీకారం చుట్టారు. తమకు రక్షణ అవసరమని భావించిన మహిళలు ఎక్కడి నుంచి ఫోన్‌ చేసినా 5 నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని వారిని గమ్యానికి భద్రంగా చేరుస్తారు. ప్రస్తుతం కాకినాడకే పరిమితమైన ఈ సేవలను రానున్న రోజుల్లో ఇతర పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని ఎస్పీ తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణే ఈ సేవల ప్రధాన లక్ష్యమని అన్నారు. 

రాష్ట్రంలోనే ప్రథమం 
రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలకు భద్రత కల్పించే ఈ వినూత్న సేవలు రాష్ట్రంలోనే ప్రథమం. ప్రకాశం జిల్లాలో ఈ తరహా సేవలున్నా డయల్‌ 100 మాత్రమే వినియోగిస్తున్నారు. కాకినాడలో మాత్రం ప్రత్యేక ఫోన్‌ నంబర్లు కేటాయించారు. నాగ్‌పూర్, పంజాబ్‌ పోలీసులు కూడా ఈ తరహా సేవలను మహిళలకు అందుబాటులోకి తెచ్చారు. 

పోలీసు కంట్రోలు రూమ్‌ కనుసన్నల్లో.. 
► ‘వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ సేవలకు వినియోగించే వాహనాల కదలికలను జిల్లా పోలీసు కంట్రోల్‌ రూము నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఇందుకు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారిని నియమించారు. 
► ఆ వాహనంలో ప్రయాణించే మహిళలకు ఓ మహిళా కానిస్టేబుల్‌ తోడుగా ఉంటారు. 
►ఈ వాహనం నడిపేందుకు పోలీస్‌ డ్రైవర్‌నే నియమిస్తారు. వారు ఆ మహిళలను గమ్యస్థానానికి భద్రంగా చేరుస్తారు. 

‘ఉమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ సేవలు అవసరమైన వారు కాల్‌ చేయాల్సిన నంబర్లు
94949 33233, 94907 63498 

మహిళల భద్రతకు మరిన్ని సంస్కరణలు 
మహిళల భద్రత కోసం మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు సమాలోచనలు జరుపుతున్నాం. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. త్వరలో రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద రాత్రి వేళల్లో దిగే మహిళల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ‘వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ సేవలకు అందే స్పందన, అవసరం ఆధారంగా సేవల విస్తృతికి అవకాశాల్ని పరిశీలిస్తాం. మహిళల భద్రతకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆదర్శంగా జిల్లాలో ఈ సేవలు ప్రవేశపెట్టాం. ఉద్యోగినులు అధికంగా ఉండే జిల్లాలోని ఇతర అర్బన్‌ ప్రాంతాలకూ ఈ సేవలను విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నాం. – ఎం.రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ 

వీలైనంత త్వరగా విస్తరించాలి 
జిల్లా పోలీస్‌ శాఖ హర్షించదగ్గ, ఉన్నతమైన నిర్ణయం తీసుకుంది. ఇతర జిల్లాలకుచిది ఆదర్శం. పైలట్‌ ప్రాజెక్టుగా తొలినాళ్లలో ‘వుమన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ సేవలు కాకినాడకే పరిమితమైనా వీలైనంత త్వరగా జిల్లాలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలి. అవసరానికి అనుగుణంగా వాహనాలు పెంచుతూ సిబ్బంది కేటాయింపునూ పెంచాలి. అన్ని వర్గాల మహిళలకూ ఇది ఎంతో అవసరం. రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ తప్పనిసరి ప్రయాణాలు చేసే మహిళలకు ఓ భరోసా దక్కింది. 
– మామిడి విజయలక్ష్మి, సీనియర్‌ న్యాయవాది, తుని 

ఉద్యోగినులకు ఎంతో మేలు 
పోలీస్‌ శాఖ ప్రవేశపెట్టిన ‘వుమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం’ సేవలు అన్ని వర్గాల మహిళలతో పాటు ముఖ్యంగా ఉద్యోగినులకు ఎంతో ప్రయోజనకరం. ఆసుపత్రిలో షిఫ్టులకు అనుగుణంగా మహిళా వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సులు, ఇతర విభాగాలకు చెందిన మహిళలు నైట్‌ డ్యూటీలు చేస్తుంటారు. పోలీసుల నిర్ణయంతో వారికి భరోసా దక్కింది. పోలీసులు అండగా ఉన్నారన్న ధైర్యంతో ప్రయాణాల పట్ల ఆందోళన వీడి మరింత నాణ్యమైన సేవలు అందించే అవకాశం దక్కింది. 
– యండమూరి పద్మమీనాక్షి, ఏపీఎన్‌జీవో మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కాకినాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top