ఏమైపోయావ్‌ చిట్టితల్లీ! | 5 Year Old Girl Missing In Andhra Pradesh Hill Area For Five Days, Search Efforts Continue | Sakshi
Sakshi News home page

ఏమైపోయావ్‌ చిట్టితల్లీ!

Jun 11 2026 10:40 AM | Updated on Jun 11 2026 11:45 AM

Kakinada Girl Jahnavi Case

తుని రూరల్‌: మండలంలోని చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో ఐదు రోజుల కిందట అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు. రోజులు గడుస్తున్నా.. డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న తమ ముద్దులపట్టి జాడ చిక్కకపోవడంతో తల్లిదండ్రులు భవాని, గణేష్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తండ్రి కోసం అతడు కాపలా ఉన్న మామిడి తోటకు గత శనివారం బయల్దేరిన జాహ్నవి మధ్యలో దారి తప్పిపోయి అదృశ్యమైపోయింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో వెళుతున్న జ్ఞానేశ్వరిని, వారి పెంపుడు కుక్కను అదే గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని ఓ వ్యక్తి చూశాడు. 

ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు అతడు ప్రయత్నించగా.. పెంపుడు కుక్క దాడికి యత్నించింది. దీంతో, అతడు ఆ బాలికను, కుక్కను వదిలేసి గ్రామానికి చేరుకుని, తల్లి భవానీకి విషయం చెప్పాడు. కుమార్తెను తీసుకువచ్చేందుకు తల్లి వెళ్లగా అక్కడ జ్ఞానేశ్వరి కనిపించలేదు. ఈ విషయాన్ని భర్త గణేష్‌కు ఆమె చెప్పింది. వారి ద్వారా విషయం తెలియడంతో గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారి వెళ్లిన దారి వెంబడి, కొండ ప్రాంతంలో గాలించినా ఫలితం లేకపోవడంతో తుని రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అటవీ సిబ్బంది, గ్రామస్తులు కలసి బృందాలుగా కొండ ప్రాంతంలో ఆ రోజు అర్ధరాత్రి వరకూ.. ఆది, సోమ, మంగళ, బుధవారాలు గాలించినా బాలిక, పెంపుడు కుక్క ఆచూకీ తెలియరాలేదు. డ్రోన్, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా ప్రయోజనం లేకపోయింది.

 సమీప గ్రామాల్లోను తుని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లు పరిశీలించినా ఎటువంటి ఫలితం లేదు. దీంతో, జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియజేస్తే రూ.లక్ష బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. బాలిక ఆచూకీ లేదా సమాచారం తెలిసిన వారు తుని రూరల్‌ ఎస్సై 94407 96573, రూరల్‌ సీఐ 94407 96531, పెద్దాపురం డీఎస్పీ 94407 96508 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు. ఇది కూడా ఇప్పటి వరకూ ఎటువంటి ఫలితం ఇవ్వలేదు. చిన్నారితో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క మంగళవారం సాయంత్రం ఇంటికి చేరింది. జ్ఞానేశ్వరి తల్లి భవానీ వ్రస్తాన్ని నోటితో పట్టుకుంది. దీంతో, బాలిక ఆచూకీ తెలుస్తుందేమోననే ఆశ చిగురించింది. కానీ, అక్కడే ఉన్న స్థానికులు, పోలీసులు సమీపించడంతో భయంతో ఆ కుక్క స్థానికులపై దాడి చేస్తూ మళ్లీ ఆయిల్‌పామ్‌ తోటలోకి పరుగు తీసి, తప్పించుకుని కొండ పైకి పారిపోయింది. 

అణువణువూ జల్లెడ పట్టినా.. 
ఐదో రోజైన బుధవారం పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్‌ ఆధ్వర్యాన తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐల పర్యవేక్షణలో డివిజన్‌లో పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఇతర బృందాలు గ్రామ సమీపంలోని వివిధ తోటలను, గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాన్ని ముమ్మరంగా జల్లెడ పట్టారు. సీసీ ఫుటేజ్‌లు మరోసారి పరిశీలించారు. డ్రోన్, డాగ్‌ స్క్వాడ్‌తో గాలింపును, గ్రామంలో ఎన్యూమరేషన్‌ సెర్చింగ్‌ కొనసాగించారు. పంట పొలాల్లోని బావులు, కుంటలు, బోరు బావుల వద్ద జల్లెడ పట్టారు. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా చేతికి జ్ఞానేశ్వరి చిక్కిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆ చిన్నారి కొండ పైకి వెళ్తే ఇప్పటి వరకూ నీరు, ఆహారం లేకుండా బతకడం దాదాపు అసాధ్యమని స్థానికులు భావిస్తున్నారు. ఎంత విస్తృతంగా వెతికినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడం గాలింపు బృందాలకు అంతు చిక్కడం లేదు. బాలిక అదృశ్యం మిస్టరీ వీడకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement