కుక్క దొరికింది.. చిన్నారి ఏమైందో..? | Kakinada Child Gnaneswari Missing Case Latest News | Sakshi
Sakshi News home page

కుక్క దొరికింది.. చిన్నారి ఏమైందో..?

Jun 12 2026 4:54 AM | Updated on Jun 12 2026 7:34 AM

Kakinada Child Gnaneswari Missing Case Latest News

ఆరు రోజులైనా లభించని రెండేళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ  

గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసుంటారనే అనుమానాలు  

తమ బిడ్డ ఏమైందోననే ఆందోళనలో తల్లిదండ్రులు  

తుని రూరల్‌: కాకినాడ జిల్లా తుని మండలం చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో ఆరు రోజుల కిందట అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు భవాని, గణేష్ తోపాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ చిన్నారితోపాటు అదృశ్యమై మూడు రోజుల అనంతరం మంగళవారం ప్రత్యక్షమై, మళ్లీ పరారైన పెంపుడు కుక్క బుధవారం అర్ధరాత్రి ఎట్టకేలకు డాగ్‌ క్యాచర్‌ బృందానికి చిక్కింది. దీంతో కీలక ఆధారం లభించిందని పోలీసులు భావించారు.

ఆ కుక్కకు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చి... దానిని వదిలిపెడితే.. అది సంచరించే మార్గంలో పోలీసులు గాలించి చిన్నారి ఆచూకీ కనిపెట్టాలని భావించారు. అయితే, ట్రాకర్‌ అందుబాటులో లేకపోవడంతో గురువారం అది సాధ్యం కాలేదు. ఆ కుక్కను రోజంతా గణేష్‌ ఇంటి ముందర మామిడి చెట్టు వద్ద కట్టి, పోలీసుల సంరక్షణలో ఉంచారు. కొంతసేపు ప్రశాంతంగా ఉంటున్న ఆ కుక్క అప్పుడప్పుడు సమీపంలోని వ్యక్తులపై దాడికి యత్నిస్తోంది.

పెద్దాపురం డీఎస్పీ తిలక్‌ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, యాంటీ నక్సల్‌ స్క్వాడ్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్, అటవీ అధికారుల బృందాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. అనుమానిత ప్రాంతాలపై నిఘా ఉంచి, డ్రోన్‌తో జల్లెడ పట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు సేకరించి పరిశీలిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ఇంటింటా ఎన్యూమరేషన్‌ చేశారు. కొండ ప్రాంతంలో చిన్నారి లేకపోవచ్చని, కిడ్నాప్‌ లేదా గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. జ్ఞానేశ్వరి ఆరు రోజులుగా ఎక్కడుందో, ఎలా ఉందో, ఏమైపోయిందోనని కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement