సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం అక్రమ అరెస్ట్ కేసులో జోగి రమేష్ సోదరులకు ఊరట లభించింది. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, జోగి రమేష్ సోదరులు ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
కాగా, ఇప్పటికే భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, నకిలీ మద్యం కేసులో 85 రోజులుగా జైలులో ఉన్న జోగి రమేష్, జోగి రాము. ప్రస్తుతం విజయవాడ సబ్‌జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ వచ్చిన నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటల లోపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైనా, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. అనంతరం, జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము పోలీసులు అరెస్టు చేశారు.
ఇక, అరెస్ట్ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు నా మీద కక్ష కట్టాడు. అందులో భాగమే ఈ అక్రమ అరెస్టు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య, బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను.. కనకదుర్గమ్మ వారి దగ్గరకు తీసుకువెళ్లాను.. ప్రమాణం చేసి చెప్పాను. అయినా చంద్రబాబునాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు దుర్మార్గానికి, పిచ్చికి ఇది పరాకాష్ట. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మృతి చెందిన సంఘటనను డైవర్షన్ చేసేందుకు కుట్ర పన్నారు. నన్ను అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబునాయుడు, లోకేశ్.. ఖబడ్దార్.. మీకు భార్య, పిల్లలు ఉన్నారు. మీకు కుటుంబం ఉంది. నన్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు.


