జిందాల్‌ విద్యుత్‌ టారిఫ్‌ పెంపు! | Jindal Power Tariff Hike | Sakshi
Sakshi News home page

జిందాల్‌ విద్యుత్‌ టారిఫ్‌ పెంపు!

Jun 20 2026 5:11 AM | Updated on Jun 20 2026 5:11 AM

Jindal Power Tariff Hike

విశాఖపట్నంలో వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న జిందాల్‌  

ప్రస్తుతం 15 మెగావాట్ల ప్లాంట్‌ విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.6.22  

6 మెగావాట్ల కొత్త ప్లాంట్‌ విద్యుత్‌ యూనిట్‌కు 20.5 శాతం అధికధర కోరుతున్న వైనం  

యూనిట్‌ ధర రూ.7.50 లేదా అంతకన్నా ఎక్కువ పెంచాలని ఏపీఈఆర్‌సీని కోరిన సంస్థ 

ఈ డిమాండ్‌ను ఆమోదిస్తే ప్రజలపై మరింత భారం

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న జిందాల్‌ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ తన అదనపు ఆరు మెగావాట్ల ప్లాంట్‌కు యూనిట్‌ విద్యుత్‌ ధరను రూ.7.50 లేదా అంతకంటే ఎక్కువగా నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని కోరింది. ప్రస్తుతం సంస్థ నిర్వహిస్తున్న 15 మెగావాట్ల ప్లాంట్‌ విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.6.22 అమలులో ఉండగా, కొత్త ప్లాంట్‌కు దాదాపు 20.5 శాతం అధిక ధర కోరడం గమనార్హం. 

జిందాల్‌ చేసిన ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు అధికధరకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న డిస్కంలకు ఈ పెంపు మరింత భారంగా మారే అవకాశం ఉంది. చివరికి ఈ అదనపు భారం వినియోగదారులపై పడే ప్రమాదం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

తక్కువ నాణ్యత.. ఎక్కువ ఖర్చులు  
మున్సిపల్‌ ఘనవ్యర్థాల ఉష్ణ విలువ కిలోకి కేవలం 1,000 నుంచి 1,800 కిలోకేలరీలు మాత్రమే ఉండటంతో విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని సంస్థ పేర్కొంది. అలాగే స్టేషన్‌ హీట్‌ రేట్‌ను 4 వేల నుంచి 4,500 కిలోకేలరీలు/కిలోవాట్‌ గంటగా పరిగణించాలని కోరింది. వ్యర్థాల నిర్వహణ కోసం టిప్పింగ్‌ ఫీజు అవసరమని సంస్థ వాదిస్తోంది. తమిళనాడులో టన్ను వ్యర్థాల దహనానికి రూ.500 టిప్పింగ్‌ ఫీజు చెల్లిస్తున్నట్లు ఉదాహరణ చూపింది. 

అయితే ఒకవైపు అధిక టారిఫ్, మరోవైపు టిప్పింగ్‌ ఫీజు, అదనంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా కొనసాగించాలని కోరడంతో ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాల కంటే ప్రజలపై భారం పెరిగే అవకాశమే ఎక్కువగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 15 మెగావాట్ల ప్లాంట్‌కు ఉన్న టారిఫ్‌తో పోలిస్తే అధికధర కోరుతున్న నేపథ్యంలో ఏపీఈఆర్‌సీ నిర్ణయం కీలకం కానుంది. ప్రజలపై అదనపు ఆర్థికభారం పడకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఇంధనరంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను జూలై 1వ తేదీలోగా తెలియజేయాలని ఏపీఈఆర్‌సీ కోరింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement