జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్‌ రజిత్‌గుప్తా | JEE-Advanced 2025 results: Delhi zone Rajit Gupta tops IIT entrance | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్‌ రజిత్‌గుప్తా

Jun 3 2025 5:49 AM | Updated on Jun 3 2025 6:20 AM

JEE-Advanced 2025 results: Delhi zone Rajit Gupta tops IIT entrance

రజిత్‌ గుప్తా ,జ్ఞానరుత్విక్‌ సాయి

ఓబీసీ కేటగిరీ టాపర్‌గా ఏపీ విద్యార్థి జ్ఞాన రుత్విక్‌ సాయి

ఐఐటీల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా 54,378 మందికి అర్హత

హైదరాబాద్‌ జోన్‌ నుంచి అర్హత పొందిన 12,946 మంది  

టాప్‌–10లో ఇద్దరు హైదరాబాద్‌ జోన్‌ విద్యార్థులు 

అర్నవ్‌ సింగ్‌కు 9, వడ్లమూడి లోకేశ్‌కు 10వ ర్యాంక్‌లు 

నేటి నుంచి జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్లు

సాక్షి, అమరావతి/నరసన్నపేట/పిఠాపురం/బేస్తవారిపేట: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2025 ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ కాన్పూర్‌ సోమవారం ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,80,422 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయగా, 54,378 మంది అర్హత సాధించారు.

వారిలో అత్యధికంగా 12,946 మంది ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ విద్యార్థులు ఉండటం విశేషం. మొత్తం అర్హత సాధించిన వారిలో 44,974 మంది పురుష అభ్యర్థులు, 9,404 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన రజిత్‌ గుప్తా కామన్‌ ర్యాంక్‌ లిస్టులో జాతీయ స్థాయి టాప్‌ ర్యాంకర్‌గా నిలిచారు. మొత్తం 360 మార్కులకు గాను అతను 332 మార్కులు సాధించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ జోన్‌కు చెందిన  దేవదత్త మాఝీ 312 మార్కులతో మహిళల విభాగంలో టాపర్‌(జాతీయ స్థాయిలో 16వ ర్యాంకు)గా నిలిచారు.

టాప్‌–10లో ఇద్దరు ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ విద్యార్థులు అర్నవ్‌ సింగ్‌ 9వ ర్యాంక్, వడ్లమూడి లోకేష్‌ 10వ ర్యాంక్‌  సాధించారు. తొలి రెండు స్థానాలతోపాటు మొత్తం టాప్‌–10 ర్యాంక్‌లలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు నాలుగు, ఐఐటీ ముంబయి జోన్‌కు మూడు, ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌కు రెండు, ఐఐటీ కాన్పూర్‌ జోన్‌కు ఒకటి చొప్పున వచ్చాయి. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం జోసా కౌన్సెలింగ్‌కు మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. 

ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ టాప్‌..
ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ తర్వాత ఢిల్లీ జోన్‌లో 11,370 మంది, ముంబయి జోన్‌లో 11,226, రూర్కీ జోన్‌లో 5,445, ఖరగ్‌పూర్‌ జోన్‌లో 5,353, కాన్పూర్‌ జోన్‌లో 5,295, గువాహటి జోన్‌లో 2,743 మంది ప్రవేశాలకు అర్హత సాధించారు. ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన జోన్‌లతో పోలిస్తే అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాద్‌ జోన్‌ విద్యార్థులు గణనీయమైన ఫలితాలు సాధించారు.

టాప్‌–10లో ఇద్దరు, టాప్‌–100లో 23 మంది, టాప్‌–200లో 57 మంది, టాప్‌–300లో 78 మంది, టాప్‌–400లో 116 మంది, టాప్‌–500లో 136 మంది ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ విద్యార్థులు ఉన్నారు. ఇక జాతీయ స్థాయిలో జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌కు చెందిన వంగల అజయ్‌రెడ్డి, ఓబీసీ–ఎన్‌సీఎల్‌ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి మొదటి ర్యాంకులు పొందారు. ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ టాపర్‌గా అర్నవ్‌ సింగ్, మహిళల కేటగిరీలో కోరికన రసజ్ఞ (జాతీయ స్థాయిలో 78వ ర్యాంక్‌) టాపర్‌గా నిలిచారు.

శ్రీకాకుళం జిల్లా విద్యార్థికి ఓబీసీ కేటగిరీ టాప్‌ ర్యాంక్‌ 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2025 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి  ఓబీసీ–ఎన్‌సీఎల్‌(నాన్‌ క్రిమిలేయర్‌) కేటగిరీలో మొదటి ర్యాంక్‌ పొందాడు. జనరల్‌ కేటగిరీలో ఆలిండియా 18వ ర్యాంకు వచ్చింది. ఓవరాల్‌గా 310 మార్కులు వచ్చాయి. అతనికి జేఈఈ మెయిన్‌ పరీక్షలో కూడా 99.99 శాతం మార్కులు వచ్చాయి. తమ కుమారుడికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ రావడంపై జ్ఞాన రుత్విక్‌ సాయి తల్లిదండ్రులు ధర్మాన లత, శంకర్‌ నారాయణ ఆనందం వ్యక్తంచేశారు.

దివ్యాంగుల కేటగిరీలో తన్వీకి రెండో ర్యాంక్‌ 
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన అప్పన రాజరాజేశ్వరి తన్వీ దివ్యాంగుల కేటగిరీలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించింది. ఆమె తండ్రి రాజేష్‌ పిఠాపురంలో వ్యాపారి. తల్లి సుప్రియ గృహిణి. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి, సివిల్స్‌ సాధించాలన్నదే తన ధ్యేయమని తన్వీ తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురానికి చెందిన మంతు వెంకట రవిచంద్రారెడ్డి ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో జాతీయ స్థాయి 8వ ర్యాంక్‌ సాధించాడు. అతని తల్లిదండ్రులు మంతు రాజశేఖరరెడ్డి, వెంకట రత్నాలు సంతోషం వ్యక్తంచేశారు.

జాతీయ స్థాయిలో టాప్‌ 10 అభ్యర్థులు
ర్యాంకు    పేరు                                                   జోన్‌
1        రజిత్‌ గుప్తా (332 మార్కులు)                      ఐఐటీ ఢిల్లీ
2        సక్షం జిందాల్‌ (332 మార్కులు)                  ఐఐటీ ఢిల్లీ
3        మాజిద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌ (330 మార్కులు) ఐఐటీ ముంబయి
4        పార్థ్‌ మందర్‌ వర్తక్‌ (327 మార్కులు)    ఐఐటీ ముంబయి
5        ఉజ్వల్‌ కేసరి (324 మార్కులు)        ఐఐటీ ఢిల్లీ
6        అక్షత్‌ కుమార్‌ చౌరాసియా (321 మార్కులు)    ఐఐటీ కాన్పూర్‌
7        సాహిల్‌ ముఖేష్‌ డియో (321 మార్కులు)    ఐఐటీ ముంబాయ్‌
8        దేవేష్‌ పంకజ్‌ భయ్యా (319 మార్కులు)    ఐఐటీ ఢిల్లీ
9        అర్నవ్‌ సింగ్‌ (319 మార్కులు)        ఐఐటీ హైదరాబాద్‌
10        వడ్లమూడి లోకేశ్‌ (317 మార్కులు)        ఐఐటీ హైదరాబాద్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2025కి గణాంకాలు ఇలా..
జెండర్‌                నమోదు        హాజరు            అర్హత
పురుషులు        1,43,810        1,39,085        44,974
మహిళలు         43,413            41,337           9,404
మొత్తం             1,87,223        1,80,422         54,378

Advertisement
 
Advertisement
Advertisement