‘పట్టాదార్‌’పై పంతం! | Issuance of passbooks suspended for 11 months | Sakshi
Sakshi News home page

‘పట్టాదార్‌’పై పంతం!

May 10 2025 5:25 AM | Updated on May 10 2025 5:25 AM

Issuance of passbooks suspended for 11 months

11 నెలల నుంచి పాస్‌ పుస్తకాల జారీ నిలిపివేత

జగన్‌ ఫొటో ఉందనే కారణంతో కూటమి ప్రభుత్వ నిర్వాకం 

ఇచ్చిన వాటిని కూడా వెనక్కి తీసుకున్న సర్కారు

ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామంటూ తీవ్ర జాప్యం 

బ్యాంకు రుణాలు, క్రయవిక్రయాలు నిలిచిపోయి రైతుల ఇక్కట్లు 

ఎప్పుడొస్తాయో చెప్పలేమంటున్న అధికారులు 

నాడు రీసర్వేపై దుష్ప్రచారం.. నేడు నోరెత్తని వైనం

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో రైతులు విలవిల్లాడుతున్నారు. గత ప్రభుత్వంపై అక్కసుతో రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల జారీని నిలిపి వేయడంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాటిపై అప్పటి సీఎం జగన్‌ ఫొటో ఉందనే కారణంతోపాటు లేనిపోని నిందలు మోపి 11 నెలలుగా పాస్‌ పుస్తకాలను జారీ చేయడం లేదు. గత ప్రభుత్వం ఇచి్చన లక్షలాది పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల స్థానంలో కొత్తవి ఇస్తామని వాటిని వెనక్కి తీసుకుంది. దీంతో రైతులు బ్యాంకులు, ఇతర అవసరమైన చోట వాటి గురించి చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. 

పాస్‌ పుస్తకాలు లేవనే కారణంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. తనకు భూమి ఉందని నిరూపించుకునే ఏకైక ఆధారమైన పాస్‌ పుస్తకం తమ దగ్గర లేక రైతులు కష్టాలు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భూముల రీ సర్వేను ప్రారంభించి 2024 ఏప్రిల్‌ నాటికి  8 వేలకుపైగా గ్రామాల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అత్యాధునికంగా డ్రోన్లతో భూమిని కొలిచి జియో కో–ఆర్డినేట్స్‌తో హద్దులు నిర్ధారించింది. ఆ హద్దుల్లో ప్రభుత్వ ఖర్చుతోనే రాళ్లు పాతించింది. అనంతరం క్యూఆర్‌ కోడ్‌తో రైతులకు పాస్‌ పుస్తకాలు జారీ చేసింది. 

ప్రతి రైతుకు ఆధార్‌ నంబర్‌ తరహాలో ఒక యూనిక్‌ ఐడీని కేటాయించింది. రికార్డుల్లోగానీ, భూమిపైగానీ ఎటువంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి చెప్పేలా చర్యలు తీసుకుంది. తద్వారా స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో రీ సర్వే చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ సర్వే విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్ల రాయితీ ప్రకటించింది. వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన భూ సంస్కరణలను వ్యతిరేకించి, కూటమి నేతలు అభాండాలు మోపారు. ఇటీవల అదే కూటమి ప్రభుత్వం ఆ సొమ్మును స్వీకరించడం విశేషం.  

కొత్తవి ఎప్పుడిస్తారో తెలీదట! 
» కూటమి ప్రభుత్వం రీ సర్వేను కొనసాగించినా పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటో ఉందనే కారణంతో 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన పుస్తకాలను రైతులకు పంచలేదు. పంచిన వాటిని కూడా వీఆర్‌ఓల ద్వారా వెనక్కి తీసుకుంది. వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.15 కోట్లతో టెండర్‌ పిలిచింది.  
» చెన్నైకి చెందిన కంపెనీకి టెండర్‌ ఖరారు చేసినా ఇప్పటి వరకు ముద్రణ ఏ స్థాయిలో ఉందో కూడా బయటకు తెలియనీయడం లేదు. అవి ఎప్పుడు వస్తాయో తమకు తెలియదని తహశీల్దార్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులు కూడా సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు.  
»  పాస్‌ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నంబర్ల స్థానంలో ఎల్‌పీఎం నంబర్లు కేటాయించారు. కానీ.. పాస్‌పుస్తకాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు కూడా జరగడం లేదు.  
»  కొనుగోలు చేసేవాళ్లు రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నా, పాస్‌ పుస్తకాలు లేవనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం పాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే అడంగల్‌లో పేరు మారుతుంది తప్ప పుస్తకం రావడం లేదు. మరోవైపు రీ సర్వే జరగని గ్రామాల్లోనూ పాస్‌ పుస్తకాలు జారీ కావడం లేదు. దీంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement