
చోరీ కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
నరసన్నపేట/జలుమూరు: వంశధార నదిలో నరసన్నపేట మండలం చోడవరం గ్రామానికి చెందిన ఇద్దరు జాలర్లకు ఇటీవల దొరికిన ఐరన్ లాకర్ కథ ఎట్టకేలకు జలుమూరు పోలీసు స్టేషన్‌కు చేరింది. ఈ లాకర్ వ్యవహారంపై శ్రీకాకుళం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం చేరడంతో వారు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నరసన్నపేట మండలం చోడవరం గ్రామానికి చెందిన ఇద్దరు జాలర్లు శైలాడ బుచ్చయ్య, మడ్డి రామకృష్ణలు 15 రోజుల క్రితం వంశధారలో చేపల వేటకు వెళ్లగా వారికి ఒక ఐరన్ లాకర్ దొరికింది.
లాకర్ బురద పట్టి ఉండడంతో వీరు తెరవలేక గారకు చెందిన ఒక పాత ఇనుప సామాన్ల వ్యాపారికి రూ.2 వేలకు విక్రయించారు. ఆయన లాకర్‌ను తెరిపించి చూడగా వెండి వస్తువులు, బురద పట్టిన కొంత డబ్బు బయట పడ్డాయి. ఈ సమాచారం రెవెన్యూ యంత్రాంగం దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోలేదు. కొద్ది రోజులకు పోలీసులకు విషయం తెలిసింది. దీంతో శ్రీకా కుళం టాస్క్‌ఫోర్సు పోలీసులు దీనిపై దృష్టి సారించి కూపీ లాగారు.
చోరీకి గురైన లాకర్‌తో సంబంధం
జలుమూరు మండలం సురవరం గ్రామానికి చెందిన సురవరపు శివప్రసాద్ ఇంట్లో చోరీకి గురైన ఐరన్ లాకర్‌కు దీనికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు. 2024 జులై 21వ తేదీన తమ ఇంట్లో చోరీ జ రిగినట్లు శివప్రసాద్ అప్పట్లో జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఇద్దరు జాలర్లను పోలీసులు స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించి, వారి ద్వారా ఐరన్ లాకర్, దాంట్లో ఉన్న వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సుమా రు రెండు కేజీల వెండి వస్తువులు, రెండు లక్షల డబ్బు ఉన్నట్లు సమాచారం. దీనిపై నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా చోడవరంలో దొరికిన ఐరన్ లాకరుకు, సురవరపు జగదీశ్వరరావు ఇంట్లో చోరీకి గురైన లాకరుకు సంబంధం ఉందన్నారు. అయితే జాలర్లు నిందితులు కాదని, అందువల్ల వారిని విడిచి పెట్టామన్నారు. ఈ కేసు తదుపరి దర్యాప్తు చేస్తున్నామన్నారు.