తలొగ్గకుంటే హుష్‌‘ఖాకీ’! | IPS officers to be transferred soon | Sakshi
Sakshi News home page

తలొగ్గకుంటే హుష్‌‘ఖాకీ’!

Jun 25 2025 5:19 AM | Updated on Jun 25 2025 5:19 AM

IPS officers to be transferred soon

త్వరలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

పలు జిల్లాల ఎస్పీలపైనా బదిలీ వేటుకు సన్నద్ధం 

నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు ఎస్పీల బదిలీకి నిర్ణయం? 

సీనియర్‌ ఐపీఎస్‌లకూ స్థాన చలనం 

నెలాఖరుకు బదిలీ ప్రక్రియ పూర్తికి ప్రభుత్వం కసరత్తు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు ము­మ్మరం చేసింది. పలు జి­ల్లాల ఎస్పీలపై బదిలీ వేటు­కు రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు సీనియర్‌ ఐపీఎస్‌ అధి­కా­రులకు కూడా స్థానచలనం తప్ప­దని తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను భారీ స్థాయిలో బదిలీ చేసింది. 

కానీ ఏడాది గడిచేసరికే మళ్లీ భారీ స్థాయిలో బదిలీలకు సిద్ధపడుతుండటం గమనార్హం. హరీశ్‌ కుమార్‌ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించడంతో బదిలీల కసరత్తు ముమ్మ­రం చేసింది. ఈ నెలాఖరుకు ఐపీఎస్‌ల బదిలీ ప్రక్రియను కొలిక్కి తేవాలని భావిస్తోంది. 

గుంటూరు ఎస్పీపై గుర్రు!
రాష్ట్రంలో ఏడెనిమిది జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీసత్యసాయి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లా ఎస్పీల బదిలీకి ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో గుంటూరు ఎస్పీ సతీశ్‌­ను కూడా బదిలీ చేయాలని సర్కారు భావిస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 18న పల్నాడు జిల్లా పర్యటించిన సందర్భంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో ప్రభుత్వ కుట్రకు ఎస్పీ మొదట తలొగ్గకపోవడంతో ఆయనపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. 

కాన్వాయ్‌లో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ( ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని ఎస్పీ స­తీశ్‌ విచారణలో తేలింది. దాంతో అదే విషయాన్ని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమక్షంలోనే ఆయన వెల్లడించారు. కానీ ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ ఎస్పీ వాస్తవ విషయాలను వెల్లడించడంతో వారి పన్నాగం బెడిసి­కొట్టింది.దీంతో ప్రభుత్వ పెద్దలు ఎస్పీ సతీశ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చి 3 రోజుల్లోనే మరో ప్రకటన చే­యించారు. 

జగన్‌ వాహనం కింద పడే సింగ­య్య మృతి చెందినట్టు చెప్పించారు. ఆ వాహన డ్రైవర్‌గా ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ రమణారెడ్డితోపాటు జగన్, ఎంపీ వైవీ సుబ్బా­రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల ర­జినీ పై అక్రమ కేసు నమోదు చేయించారు. కూటమి ప్రభుత్వం కేవలం రా­జకీయ దురుద్దేశంతోనే అక్రమ కేసు నమో­దు చేసిందన్నది బట్టబయలైంది. తమ కుట్రకు మొదట్లో స­హ­కరించని ఎస్పీ సతీశ్‌పై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నా­రు. దీంతో ఆయనను బదిలీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. 

ఎస్పీతో నిమిత్తం లేకుండా ఆ అక్రమ కేసు వ్య­వ­­హారాన్ని పర్యవేక్షించాలని టీడీపీ వీర విధేయ ఐపీఎస్‌ అధికారి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఆదేశించినట్లు సమాచారం. రెడ్‌బుక్‌ అక్రమ కేసు­ల బనాయింపులో ప్రభుత్వం ఆశించిన మేరకు పనిచేయలేకపోతున్నారనే కారణంతో నెల్లూరు, చి­త్తూ­రు, కృష్ణా జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని భావిస్తున్నారు.

హోం శాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బలి!
కాపు రిజర్వేషన్‌ ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి వేధించాలన్న సీఎం చంద్రబాబు పన్నాగం ఇటీవల బెడిసికొట్టింది. 2016లో తునిలో రైలుపై దాడి కేసును తిరగదోడుతూ కాపు రిజర్వేషన్‌ ఉద్యమకారులపై మళ్లీ కేసు పెట్టి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం భావించింది. కాపు ఉద్యమ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ మేర­కు హోం మంత్రి అనిత సంతకం చేసి పంపించిన  ఫైల్‌­ను ఆమోదిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ జీవో జారీ చేశా­రు.

రైలు దహనం ఘటన కేసును మళ్లీ వి­చారించేందుకు హైకోర్టు అనుమతి కోరుతూ పిటిషన్‌ వేసేందుకు ప్రభుత్వ న్యాయవాదికి అనుమతినిచ్చారు. కానీ ప్రభు­త్వ కుట్రపై కాపులు ఎదురుతిరిగడంతో ప్రభుత్వం ఆ జీఓను ఉప­సంహరించుకుంది. ఈ ఉదంతంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని నమ్మించేందుకు కుమార్‌ విశ్వజిత్‌ను బదిలీ చేయాలని భావిస్తోంది.

» విశ్వజిత్‌ స్థానంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యాన్ని హోం­శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది. ఆ పోస్టుతోపాటు ఆయనను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా నియమించే ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
»  సీఐడీ డీజీ రవి శంకర్‌ అయ్యన్నార్, ఏసీబీ అదనపు డీజీ అతుల్‌ సింగ్‌ తదితరులనూ బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
» కీలకమైన విశాఖపట్నంలో తమ అక్రమాలు, కుట్రలకు సహకరించడం లేదని పోలీస్‌ కమిషనర్‌ శంకభాత్ర బాగ్చీపై కూడా ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు స్థాన చలనం తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి.
»  రవాణా శాఖ కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హాను కీలక పోస్టులో నియమించే అవకాశాలున్నాయి. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పోస్టులోనే కొనసాగుతున్న ఏకైక ఐపీఎస్‌ అధికారి ఆయనే. ఈ ఏడాది కాలంలో ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలకు మరింత సన్నిహితుడిగా మారినట్టు సమాచారం. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కీలక పోస్టుపై మనీశ్‌ కుమార్‌ సిన్హా కన్నేసినట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement