గిరిజన విద్యార్థిని దారుణహత్య | Inter Student Died in Anantapur | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థిని దారుణహత్య

Jun 9 2025 5:17 AM | Updated on Jun 9 2025 11:05 AM

Inter Student Died in Anantapur

ఈనెల 3న అదృశ్యం.. ముళ్లపొదల్లో మృతదేహం లభ్యం

తలపై బలమైన గాయం.. బీరుబాటిల్‌తో కొట్టి చంపినట్టు ఆనవాళ్లు  

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ఘటన   

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక  

పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు

బాలికల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది 

నిందితులను శిక్షించాలని గిరిజన సంఘాల ఆందోళన  

అనంతపురం /కూడేరు: కూటమి సర్కారు పాల­నలో మరో ఘాతుకం జరిగింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఎన్‌సీసీ నగర్‌ సమీపాన ముళ్ల పొదల్లో  ఇంటర్‌ విద్యార్థిని తన్మయి(19) దారుణహత్యకు గురైంది. ఆమె తలపై బలమైన గాయం ఉంది. ఘటనాస్థలంలో బీరుబాటిల్‌ లభ్యమైంది. దీంతో దుండగులు బీరుబాటిల్‌తో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం నగరంలోని టీవీ టవర్‌ దగ్గర ఉన్న రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి, అరుణ దంపతులకు కొడుకుతో­పాటు కుమార్తె తన్మయి ఉన్నారు.

 తన్మయి ప్రస్తుతం ఆకుతోట­పల్లి వద్ద గల ఓ కాలేజీలో ఇంటర్మీడి­యెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన్మయి ఈ నెల 3న అదృశ్యం కావడంతో మరు­సటి రోజు తండ్రి లక్ష్మీపతి అనంతపురం వన్‌టౌన్‌ పోలీసు­స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాత్రి 9గంటల సమ­యంలో కడుపు నొప్పిగా ఉందని కూల్‌ డ్రింక్‌ తాగ­డానికి బయ­టకు వెళ్లిందని, తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యా­దులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే.. కూడేరు మండల పరిధిలోని ఎన్‌సీసీ నగర్‌ సమీపాన ముళ్ల పొదల్లో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అప్ప­టికే కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆదివారం తన్మయి తల్లిదండ్రులు చూసి తమ కూతు­రేనని గుర్తించారు. అనంతపురం సర్వజనా­స్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యు­లకు అప్పగించారు.

హత్యగా ధ్రువీకరించిన వైద్యులు 
తలకు బలమైన గాయమైందని, దేనితోనో కొట్టడంతోనే తన్మయి మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం లభ్య­మైన ప్రాంతంలో బీర్‌ బాటిల్‌ ఉండడంతో దాంతోనే తలపై కొట్టి చంపారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తన్మయి కాల్‌­డేటా ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశా­రు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

నిందితులను కఠినంగా శిక్షించాలి
గిరిజన విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేసి నిందితులను అరెస్ట్‌ చేయాలన్నారు. హోంమంత్రి దళిత మహిళ అయినా కూటమి పాలనలో రాష్ట్రంలోని దళిత, గిరిజన మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement