
అక్రమ మైనింగ్‌కు సహకరించారంటూ కేసు
ఇప్పటికే 16 విచారణలు, 8 కేసులు
అవినీతి జరగలేదని తేల్చిచెప్పిన విజిలెన్స్.. అయినా సిట్‌వేసి అక్రమ కేసులతో వేధింపులు
నాన్‌బెయిలబుల్ సెక్షన్లతో అరెస్టు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వారిపై రెడ్‌బుక్ రాజ్యాంగం ద్వారా ఉక్కుపాదం మోపుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా మాజీమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని టార్గెట్ చేసింది. అక్రమ కేసులతో వేధించే పరంపరలో కాకాణిపై అక్రమ కేసు పెట్టింది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని ‘రుస్తుం మైన్స్’లో అక్రమ మైనింగ్ జరిగిందని.. అందులో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, వారికి ఆయన సహకరించారంటూ కాకాణిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పోలీసులు అక్రమ కేసులు నమోదుచేశారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్న ఆయన్ని కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం వేధిస్తోందన్నది స్పష్టమవుతోంది.
కాకాణిపై ఇవీ కేసులు..
⇒ గతేడాది గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ సెంట్రల్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెడితే ఆ వార్తను ’సాక్షి’ కవర్ చేసింది. ఆ కథనాన్ని తన వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారని వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.
⇒ వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్‌మీట్ పెడితే కాకాణి ఆ వీడియోను కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారని మరో కేసు పెట్టారు.
⇒ స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టారని ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు.
⇒ గతేడాది అక్టోబరులో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలుచేయకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా కాకాణి గోవర్థన్‌రెడ్డి వారికి సంఘీభావంగా వెళ్లి అందులో పాల్గొన్నందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.
⇒ గతేడాది డిసెంబరులో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యపై పోలీసులు అక్రమ కేసు నమోదుచేసి జైలుకు పంపారు. వీరి తీరుపై కాకాణి మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ టీడీపీ కార్యకర్త నెల్లూరు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదుచేస్తే కేసు నమోదు చేశారు.
⇒ ఇక కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం కోళ్లదిన్నెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. గాయపడ్డ వారిని పరామర్శించిన కాకాణి అక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టారు. దీనిపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేశారు.
⇒ తాజాగా.. పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌లో గత ప్రభుత్వ హయాంలో అనధికారికంగా మైనింగ్ చేసి క్వార్ట్జ్ మెటల్‌ను తరలించారని, అందుకు కాకాణి తన అనుచరులకు సహకరించారనే కారణం చూపి ఆయనపై కేసు బనాయించారు. కానీ, ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్టుకాగా.. వారి రిమాండ్ రిపోర్టులో ఎక్కడా కాకాణి పాత్ర ఉన్నట్లు ధృవపరచలేదు. ఇదంతా కూడా పోలీసుల కల్పితమే తప్ప ఎక్కడా వీరి పాత్రగానీ, కాకాణి పాత్రగానీ లేకపోవడం గమనార్హం.
ఇప్పటివరకు 16 విచారణలు..
గత ప్రభుత్వ హయాంలో కాకాణి గోవర్థన్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు విజిలెన్స్ విచారణ చేయించారు. ఇప్పటికి 16సార్లు విజిలెన్స్ అధికారులు విచారణచేసి అవినీతి జరగలేదని తేల్చిచెప్పారు. దీంతో ఎలాగైనా కాకాణిని జైలుకు పంపేందుకు ప్రభుత్వ పెద్దలు చేయని ప్రయత్నాల్లేవు. ఇందులో భాగంగా.. ఒంగోలుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటుచేసి విచారణ చేయిస్తున్నారు.