నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..?  | Sakshi
Sakshi News home page

నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? 

Published Sun, Aug 21 2022 4:19 PM

Huge Demand For Natu Kodi To Health Benefits - Sakshi

రాయదుర్గం(అనంతపురం జిల్లా): రాయదుర్గానికి చెందిన ఎరుకుల వెంకటేశులు గ్రామాలు తిరుగుతూ నాటుకోళ్లను హోల్‌సేల్‌ ధరలకు కొనుగోలు చేస్తాడు. ద్విచక్రవాహనంపై బళ్లారికి తీసుకెళ్లి అక్కడ అధిక ధరలకు అమ్మకం చేపట్టి లాభాలు పొందుతున్నాడు. వారానికి అన్ని ఖర్చులూ పోను రూ.6 వేల వరకు సంపాదిస్తున్నాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా నాటుకోడి వ్యాపారాలు చేపట్టి ఆశించిన లాభాలు పొందే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది.
చదవండి: హనీ ట్రాప్‌.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్‌ రికార్డ్‌ చేసి.. 

నాటుకోడి అంటే మాంసం ప్రియులకు నోరూరుతుంది. బ్రాయిలర్‌ చికెన్‌ ధరకు రెట్టింపు, మటన్‌తో సమానంగా ధర పలుకుతున్నా కొనుగోలుకు వెనుకాడటం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాటి మాంసానికి ఉన్న ఆదరణ చూసి  కొందరు దుకాణదారులు, హోటల్‌ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. వాటిని పోలిన జాతులను చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాటో.. కాదో నిర్ధారించుకోవడం కొంత కష్టంగా ఉన్నా, తరచి చూస్తే ఇలాంటి మోసాలకు తెరదించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఎలా పెంచుతారంటే..?  
గ్రామాల్లో దేశవాళీ నాటుకోడి పెరిగేందుకు ఎక్కువ కాలం పడుతుంది. ఆరు వారాలకు 400 గ్రాముల బరువు పెరుగుతుంది. వంద రోజులు దాటితే 1.5 కిలోలకు ఎదుగుతాయి. అదే వనరాజ, గిరిరాజ కోళ్లు ఆరు వారాల్లోనే 850 గ్రాముల పైన, బ్రాయిలర్‌ 1.50 కిలోల వరకు పెరుగుతుంది. ఫారంలో లైట్ల వెలుగులో నిద్రపోకుండా చేసి, మొక్కజొన్న, జొన్న, శనగచెక్క వంటి బలమైన ఆహారాన్ని అందిస్తూ వేగంగా పెరిగేలా చేస్తున్నారు. వాటినే మార్కెట్లో నాటుకోళ్లుగా విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట తిరిగే దేశవాళీ కోళ్లు పురుగులు, ఆకులు, గడ్డి ఇతర విత్తనాలు   వంటివి తిని బలిష్టంగా ఉంటాయి.

గుర్తించడం ఇలా.. 
నాటుకోడి కాళ్లు, ఎముకలు బలిష్టంగా ఉంటాయి. ఎక్కువ సమయం బయట నిల్వ  ఉంచినా మాంసం పాడవ్వదు. 
వండిన తర్వాత ఎముకలు నమిలేందుకు గట్టిగా ఉంటాయి. 
మటన్‌తో సమానంగా ఉడికించాల్సి వస్తుంది. 
గిరిరాజ, వనరాజ, కడక్‌నాథ్‌ కోళ్లు సాధారణంగా ఒకే రంగులో జుట్టు కలిగి ఉంటాయి. ఎముకలు పలుచగా, ఈకలు ఎక్కువగా ఉంటాయి.  
బ్రాయిలర్‌ మాంసం కూడా తక్కువ సమయంలోనే ఉడికించవచ్చు. 

నాటుకోడి రుచే వేరు.. 
కోళ్ల మాంసంలో నాటు కోడి రుచేవేరు. ఆ మాంసం ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వైద్యులు చెపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే కోళ్లలో అనేక రకాలు ఉన్నాయి. ఇలాంటి దేశవాళీతో పాటు షెడ్లలో వేగంగా పెరిగే వనరాజ, గిరిరాజ, కడక్‌నాథ్‌ వంటివి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వీటినీ నాటుకోడి మాంసమని చెప్పి విక్రయిస్తూ మోసగిస్తున్నారు. నాటుకోడి విక్రేతలు ధరలో ఎక్కడా రాజీపడరు. కిలో రూ.350 నుంచి రూ.400కు తక్కువ ఇవ్వలేరు. షెడ్లలో పెంచే కడక్‌నాథ్, గిరిరాజ ఇతర జాతుల కోళ్లు రూ.300లోపే లభ్యమవుతాయి.

ఉమ్మడి జిల్లాలో రోజూ ఒకటిన్నర టన్ను వరకు విక్రయాలు జరుగుతుంటాయని, ఒక్క అనంతపురం జిల్లాలోనే టన్ను వరకు అమ్మకాలు జరుగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారుల ప్రాథమిక అంచనా ద్వారా తెలిసింది. సాధారణంగా చాలామంది ఆదివారం మాంసం తినేందుకు ఇష్టపడతారు. పట్టణం, పల్లె ఏదైనా సరే ప్రస్తుతం అందరి చూపు నాటు కోడి వైపు మళ్లడంతో విక్రయదారులు సైతం ధరలు పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రత్యామ్నాయం.. లాభదాయకం.. 
వ్యవసాయం కలిసిరాకపోవడంతో ప్రత్యామ్నాయంగా నాటుకోళ్ల పెంపకం ఎంచుకున్నాను. మూడేళ్ల క్రితం 100 కోళ్ల పెంపకంతో మొదలు పెట్టాను. ప్రస్తుతం 300 కోళ్లకు ఫారం సామర్థ్యం పెరిగింది. ఇప్పటికే 200 కోళ్లు అమ్మేశాను. మోసం లేకుండా నాణ్యమైన దేశవాళీ బ్రీడ్‌ కోళ్లు మాత్రమే అమ్మడంతో గిరాకీ బాగా పెరిగింది. ఫారం వద్ద అయితే కిలో రూ.350 నుంచి రూ.400కు కొనుగోలు చేస్తున్నారు. ఇదే కోడి బయట మార్కెట్లో రూ.500కు పైగా అమ్ముడుపోతున్నాయి. పెట్టుబడి పోనూ రూ.40 వేలకు పైగా లాభం చేకూరుతోంది.  
– గజ్జిని సత్యనారాయణ, రైతు, గొల్లపల్లి

పొలం వద్దే  పెంపకం 
పొలం వద్దే 50 నుండి 70 వరకు నాటు కోళ్లు పెంచుతాను. పొలంలో ఆరుబయట మేత కోసం తోలి.. సాయంత్రం కొన్ని గింజలు వేస్తాను. ఒక్కో కోడి 2.50 కిలోల నుంచి 3 కిలోలకు పైగా తూకం రాగానే అమ్మకం చేపడతాను. చాలామంది అధికారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారు. అడ్వాన్స్‌ కూడా ఇచ్చిపోతారు. కిలో రూ.300 నుండి రూ.400 వరకు విక్రయిస్తాను. మంచి లాభాలు ఉన్నాయి. నాటుకోడి రుచికి.. గిరిరాజ రుచికి చాలా తేడా ఉంటుంది.  – జయరాములు, రైతు, బానేపల్లి 

కొవ్వు శాతం తక్కువ 
పెరటి కోళ్లు స్వేచ్ఛగా పెరుగుతాయి. షెడ్లలో పెంచిన వాటికంటే బలంగా ఉంటాయి. మిగిలిన వాటితో పోల్చితే పోషకాలు ఎక్కువ. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. నాటుకోడి గుర్తించే కొనుగోలు చేయడం మంచిది. ఆహార నియమాల్లో మార్పులు రావడంతో  పాటు చాలా మంది మాంసం ప్రియులు నాటుకోడి వైపు చూస్తున్నారు. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. మంచి గిరాకీ ఉండడంతో రైతులను  ప్రోత్సహిస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ 10 నుండి 20 కోళ్ల వరకు ఇళ్ల వద్ద పెంపకం కూడా బాగా పెరిగింది. 
– నవీన్‌కుమార్, పశువైద్యాధికారి, రాయదుర్గం   

Advertisement
 
Advertisement
 
Advertisement