హనీ ట్రాప్‌.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్‌ రికార్డ్‌ చేసి..  | Sakshi
Sakshi News home page

Honey Trap: హనీ ట్రాప్‌.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్‌ రికార్డ్‌ చేసి.. 

Published Sun, Aug 21 2022 2:43 PM

Young Woman Cheating Young Men With Honey Trap In Kurnool - Sakshi

సాక్షిప్రతినిధి కర్నూలు: జ్యోతిర్మయి(పేరుమార్చాం) పెళ్లికాని యువతి. ఇంటర్మీడియట్‌ చదివింది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎఫ్‌ఎన్‌ఓగా చేరింది. కొద్దిరోజులు పనిచేసి తర్వాత మానేసింది. అక్కడే రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఓర చూపులు..కొంటె నవ్వులు...కొన్ని రోజులు నడిచింది. మాటల్లో ప్రేమ చూపింది. ఇద్దరూ వీడియోకాల్‌ వరకూ వచ్చారు. జ్యోతిని నమ్మిన ఆ వ్యక్తి వాట్సాప్‌ చాటింగ్‌లతో పాటు వీడియోకాల్స్‌ తరుచూ మాట్లాడేవాడు. చాటింగ్, వీడియోకాల్స్‌ను జ్యోతి రికార్డ్‌ చేసింది.
చదవండి: ప్రేమించి పెళ్లాడి.. వదిలేశాడు

ఈ క్రమంలో అతని నుంచి జ్యోతి రూ.10వేలు అప్పు తీసుకుంది. కొద్దిరోజుల తర్వాత అప్పు తిరిగి అతను అడిగాడు. వెంటనే జ్యోతి అసలు నిజస్వరూపం బయటకు వచ్చింది. వీడియోకాల్‌ను అతని వాట్సాప్‌కు పంపింది. డబ్బులు డిమాండ్‌ చేస్తే వీడియోలు మీ స్నేహితులకు, ఆస్పత్రి సిబ్బందికి పంపిస్తానని బెదిరించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. చేసేది లేక నిమ్మకుండిపోయాడు. అంతటితో ఆగలేదు. మరో రూ.20వేలు అడిగింది. దీంతో అతను ఇవ్వలేను అనేసరికి వాట్సాప్‌ చాటింగ్‌లు, మరిన్ని వీడియోకాల్స్‌ రికార్డింగ్స్‌ స్క్రీన్‌షాట్స్‌ పంపి బ్లాక్‌మెయిల్‌ చేసింది.

భయంతో రూ.20వేలు ఇచ్చాడు. తిరిగి మరోసారి మరికొంత డబ్బులు అడిగింది. ఈ దఫా ఇవ్వలేనని అతను వాదనకు దిగారు. దీంతో జ్యోతి నేరుగా ఆస్పత్రికి వెళ్లి బ్లాక్‌మెయిల్‌తో పాటు గొడవకు దిగింది. ఈ గొడవలో అతని సెల్‌ఫోన్‌ లాక్కొని వెళ్లిపోయింది.  దీంతో చేసేది లేక అతను నేరుగా త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారి జ్యోతి గురించి ఆరా తీశారు.

2021లో త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లోనే జ్యోతి ఒక కేసు పెట్టింది. ఒక అబ్బాయి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు 353 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఆపై లోక్‌ అదాలత్‌లో కేసు కొట్టేశారు. ఈ కేసు సారాంశం పైన ఆస్పత్రిలో జరిగిన తంతే!! అలాగే ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి లైంగికంగా వేధించారని, పెళ్లి చేసుకోలేదని కేసు నమోదు చేశారు.

ఇంట్లో గొడవ జరిగిందని, తనపై, తన తల్లిపై దాడి చేశారని, దుస్తులు చించి అత్యాచారం చేసేందుకు యత్నించారని మరో కేసు నమోదైంది. దీంతో పాటు పోలీసులకు మరో విషయం తెలిసింది. ఆ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ బంధువుపైనే యువతి ‘హనీట్రాప్‌’ చేసింది. కొంత డబ్బులు తీసుకుంది. ఇదే స్టేషన్‌లో గతంలో పంచాయితీ చేసి పంపారు.

ఈ ఘటనలే కాదు...చాలామంది మగాళ్లతో పరిచయం పెంచుకోవడం, చాటింగ్, వీడియో కాల్స్‌ చేయడం, వాటి రికార్డింగ్స్‌తో బ్లాక్‌ మెయిల్‌ చేయడం జ్యోతికి అలవాటుగా మారింది. దీన్ని ఓ ఆదాయ మార్గంగా ఎంచుకుంది. పెళ్లికాని యువతి కావడంతో చాలామంది యువకులు ఆకర్షితులై పరిచయం పెంచుకుని బుట్టలో పడుతున్నారు.

ఆపై విలవిల్లాడి చేసిన పొరపాటుకు ‘పెనాల్టీ’ చెల్లిస్తున్నారు. ఎట్టకేలకు ఆసుపత్రి ఘటనతో జ్యోతి గుట్టు రట్టయింది. పోలీసులు జ్యోతిపై కేసు నమోదు చేశారు. జ్యోతి ఘటన నేపథ్యంలో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 
  

Advertisement
 
Advertisement
 
Advertisement