కేంద్రం లెక్క.. అవినీతి పక్కా! | Huge cost discrepancy in Amaravati construction works | Sakshi
Sakshi News home page

కేంద్రం లెక్క.. అవినీతి పక్కా!

Jun 11 2026 5:26 AM | Updated on Jun 11 2026 8:42 AM

Huge cost discrepancy in Amaravati construction works

అమరావతి నిర్మాణ పనుల్లో భారీగా వ్యయ వ్యత్యాసం

హైరైజ్‌ బిల్డింగుల సాక్షిగా మరోమారు అవినీతి బట్టబయలు 

సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణానికి చదరపు అడుగుకు కేంద్రం రూ.5,587.44 మంజూరు   

రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికిచదరపు అడుగుకు రూ.3,945.39 

ఈ మేరకు సెంట్రల్‌ సెక్రటేరియట్‌కు రూ.1,299.08 కోట్లు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌కు రూ.1,234.91 కోట్లు మంజూరు చేసిన కేంద్ర కేబినెట్‌ 

చదరపు అడుగుకు ఇప్పటికే రూ.20,439.58 వ్యయం చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ 

5 స్టార్‌ సదుపాయాలు, ఇటాలియన్‌ మార్బుల్స్‌తో నిర్మించినా చ.అ వ్యయం రూ.4,500కు మించదంటోన్న ఇంజినీర్లు 

కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు పంచుకుతింటుండటం వల్లే భారీగా పెరిగిన అంచనా వ్యయం  

ఆ భవనాల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుతుందో!  

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్‌ అవినీతి మరోసారి బట్టబయలైంది. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ వ్యయం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల బాగోతం బయటపడింది. సచివాలయం ‘శాశ్వత’ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58 వ్యయం చేస్తుంటే... గ్రిహ 4–స్టార్, ఎనర్జీ కన్సర్వేషన్‌ అండ్‌ సస్టెయినబుల్‌ బిల్డింగ్‌ కోడ్‌(ఈసీఎస్‌బీసీ)– 2024 ప్రమాణాలతో కట్టే కేంద్రప్రభుత్వ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌కు చదరపు అడుగుకు రూ.5,587.44 మాత్రమే కేంద్రం మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనం.

ఐఏఎస్, గ్రూప్‌–1 నుంచి గ్రూప్‌–డి, ఎన్జీవో క్వార్టర్స్‌కు చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.10 వేల నుంచి రూ.12 వేలు వ్యయం చేస్తుంటే.. గ్రిహ–4, ఈసీఎస్‌బీసీ–2024, ఎకో–నివాస్‌ సంహిత–2024 ప్రమాణాల ప్రకారం నిర్మించే రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌కు చదరపు అడుగుకు రూ.3,945.39 మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్‌ అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. 

రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు 5.53 ఎకరాల్లో జీ+13 అంతస్తులతో 23.25 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 8 వేల మంది సిబ్బంది పని చేసేందుకు వీలుగా సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.1,299.08 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే సిబ్బందికి నివాస సదుపాయం కల్పించడం కోసం 17 ఎకరాల్లో 11 టవర్లలో 31.30 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు రూ.1,234.91 కోట్లు మంజూరు చేసింది. 

ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏకీకృత సముదాయం (సీజీజీపీఓఏ), ఉద్యోగుల నివాస గహాల (జీపీఆర్‌ఏ) నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ ద్వారా మొత్తం రూ.2,533.99 కోట్లు ఖర్చు చేయనుంది.  

రూ.4,350.42 నుంచి రూ.20,439.58 వరకు.. 
» రాజధాని అమరావతిలో సచివాలయం శాశ్వత భవనాలను డయాగ్రిడ్‌ విధానంలో 39 అంతస్తులతో నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో ఒక టవర్‌ మొత్తం ఐదు టవర్లను చంద్రబాబు సర్కార్‌ నిర్మిస్తోంది. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలకు అప్పగిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  

» 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లను చంద్రబాబు సర్కార్‌ రద్దు చేసి.. 2025లో మళ్లీ టెండర్లు నిర్వహించింది. మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది.  

» ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఈ భవనాలకు హై సైడ్‌ ఎలక్ట్రికల్‌ (విద్యుత్‌ సరఫరా), హెచ్‌వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ – వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్‌ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది.  

» దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. టవర్ల డిజైన్‌ల పనులను రూ.401.54 కోట్లకు పోస్టర్‌ పార్టనర్స్‌–హాఫీజ్‌ కాంట్రాక్టర్, జెనిసిస్‌ ప్లానర్స్‌కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది.  

» అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు ఇప్పటికే రూ.20,439.57కు చేరుకుంది.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాల్లో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో ఇటాలియన్‌ మార్బుల్స్‌తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ అమరావతిలో అధిక ధరలకు కాంట్రాక్టు పనులను సిండికేటు కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టి.. నీకింత నాకింత అంటూ ప్రభుత్వ పెద్దలు దోచుకుతింటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  

మరింత పెరగనున్న అంచనా వ్యయం! 
» రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. 

» ఈ లెక్కన సచివాలయం శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో వేచి చూడాలని ఇంజినీరింగ్‌ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి చేపట్టిన భవనాల నిర్మాణ వ్యయాన్ని దేశంలో ఎక్కడా లేని రీతిలో పెంచేసి దోచుకుతింటుండటంపై ఇంజినీరింగ్‌ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement