ముంతాజ్ బేగం ఇల్లు ,హేమలత ఇల్లు
ఆ ఇద్దరి ఇళ్లు నిర్మించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లె ముంతాజ్‌బేగం, హేమలతకు 2022లో ఇళ్లు
కేవలం రంగులు వేసి గృహ ప్రవేశం అంటూ హడావుడి
హేమలత ఇంటి పత్రాలు తీసుకున్న గృహ నిర్మాణ శాఖ అధికారులు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం దేవగుడిపల్లెకు చెందిన ఎస్.ముంతాజ్‌బేగం, ఎం.హేమలతకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022లో పక్కా ఇళ్లు మంజూరు చేయగా వారు పూర్తిచేశారు. గోడలపైనా ఇదే రాశారు. ఈ వివరాలు గృహనిర్మాణశాఖ లెక్కల్లోనే స్పష్టంగా ఉన్నాయి. కానీ, వీటిలో గృహ ప్రవేశాలంటూ బుధవారం సీఎం చంద్రబాబు ఆర్భాటం చేశారు.
ముంతాజ్‌బేగంకు దేవగుడిపల్లెలో సొంత స్థలం ఉండగా పక్కా ఇంటికి 2022 మే 9న ఆమోదం వచ్చింది. ముంతాజ్‌బేగం పేరిట తహసీల్దార్ 2023 జూలై 6న పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 2022 ఏప్రిల్– 2023 జూన్ 4 వరకు మూడు బిల్లులు నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. రోజుకు రూ.200 లెక్కన 90 రోజుల ఉపాధి హామీ పథకం బిల్లు వచ్చింది. కేవలం రంగులు వేయించి బుధవారం గృహ ప్రవేశం చేయించారు.
» హేమలతకూ సొంత స్థలం ఉండగా 2022 జూలై 9న పక్కా గృహం మంజూరైంది. 2024 మార్చికి పూర్తి చేశారు. ఈ బిల్లు బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఉపాధి హామీ బిల్లు కూడా అందింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు
రంగులు వేసింది. ఇంటి స్థలం ధ్రువీకరణ పత్రం, ఇంటి మంజూరు పత్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జారీ అయ్యాయని వాటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు తీసుకున్నారని హేమలత చెప్పడం గమనార్హం.
అద్దె బాధల నుంచి విముక్తి
నా పేరు ఫాతిమా. ఇదిగో ఇది నాకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇంటి పట్టా. వ్యవసాయ కూలిగా జీవనం సాగించే నేను వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే పక్కా ఇంటి కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా. వెంటనే స్థలం, ఇంటి పట్టా ఇచ్చారు. రూ.1.80 లక్షల సాయం చేశారు. నెలనెల అద్దె కట్టడానికి ఇబ్బంది పడేవాళ్లం. జగనన్న పుణ్యాన సొంతింటి కల నెరవేరింది.
గత ప్రభుత్వంలోనే సొంతింటి సంబరం
నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్న నన్ను భర్త కొన్నేళ్ల క్రితమే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. 30 ఏళ్లు కళ్యాణదుర్గంలోని బాడుగ ఇంట్లో ఉన్నాం. నెలకు రూ.4 వేల వరకు అద్దె కట్టేదాన్ని. గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న పుణ్యమా అని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కురాకుల తోట జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది. మొత్తం బిల్లు రూ.1.80 లక్షలు మంజూరైంది. ఇప్పుడు సొంతిట్లోసంతోషంగా ఉంటున్నాం. –నబియా భాను, జగనన్న కాలనీ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం
గత ప్రభుత్వంలోనే... అద్దె ఇంటి నుంచి సొంత గూటికి
మేం చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వంలో మమ్మల్ని లబ్ధిదారులుగా గుర్తించి ఇంటి పట్టా ఇచ్చారు. ఆలస్యం లేకుండా బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంటున్నాం. 2022లో గృహ ప్రవేశం చేసి ఇందులోనే నివసిస్తున్నాం. ఇంత సాయం అందించిన జగనన్న మా పాలిట దేవుడు. –షేక్ నాగూర్ బి, గుంటూరు జిల్లా దుగ్గిరాల జగనన్న కాలనీ
సొంతింటి కల నెరవేర్చింది జగనన్న
మాకు 2.50 సెంట్ల స్థలం ఉంది. కానీ, పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు తగినన్ని డబ్బులు లేవు. చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వం రాగానే భరోసా కల్పించారు. రెండు విడతలుగా బిల్లులు నా బ్యాంక్ అకౌంట్‌లో వేశారు. నిర్మాణం పూర్తి చేసి 2023లోనే గృహప్రవేశం చేశాం.– నల్లమోతు రాణి, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా
జగనన్న హయాంలోనే మాకు ఇల్లు
నా భర్త, నేను వ్యవసాయ కూలీలం. మాకు ఇద్దరు పిల్లలు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ స్ధలంతో పాటు ఇల్లు మంజూరు చేశారు. ఇంటి పట్టా, నిర్మాణానికి డబ్బులు కూడా ఇచ్చారు. సకాలంలో బిల్లులు రావడంతో కొంత నా డబ్బులు వేసుకుని ఇల్లు పూర్తి చేశా. ఇప్పుడు అందులోనే ఉంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. జగనన్నకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. –సంగం త్రివేణి, గండేపల్లి గ్రామం, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా
15 ఏళ్ల నిరీక్షణ...
వైఎస్సార్‌సీపీ హయాంలో సాకారంసొంతిల్లు లేక చాలా ఇబ్బందిపడ్డాం. 15 ఏళ్ల పాటు అద్దె ఇళ్లలోనే ఉన్నాం. చిన్న గుడిసె, బడితెల గోడల ఇంట్లో మరికొన్నేళ్లు ఉన్నాం. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మా స్వగ్రామం మెళియాపుట్టిలోనే జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తి చేశాం. త్వరలోనే గృహప్రవేశం చేస్తాం. సొంతిల్లు అనే ఆలోచనే సంతోషంగా ఉంది. దీన్ని సాకారం చేసింది వైఎస్ జగన్. – రిన్న మహంతి, మెళియాపుట్టి గ్రామం, పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా
అన్నీ అప్పుడే మంజూరు...
జగనన్న ప్రభుత్వంలోనే మాకు పక్కాగృహం మంజూరైంది. స్థలానికి పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బిల్లులన్నీ కూడా సకాలంలో చెల్లించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మొత్తం రూ.1.80 లక్షల బిల్లు ఇచ్చేశారు.–సుజాత, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం, శ్రీసత్యసాయి జిల్లా


