ఆదాయపు పన్ను నోటీసుల జారీపై హైకోర్టు సంచలన తీర్పు
పన్ను చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ రద్దు
సవరణ ద్వారా తెచ్చిన ‘సెక్షన్ 147ఏ’ రాజ్యాంగ విరుద్ధమంటూ కొట్టివేత
‘డిజిటల్ విధానం’ స్థానంలో ‘జేఏఓల ప్రొసీడింగ్స్’ చెల్లవు
పారదర్శకతకు పెద్దపీట వేయడమే డిజిటల్ విధానం లక్ష్యం
చట్టసభలు పరిధి దాటి చేసే చట్టాలను కోర్టులు రద్దుచేస్తాయి
ధర్మాసనం స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను పునఃమదింపు నోటీసుల జారీ విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పన్ను తప్పించుకున్న ఆదాయంపై నోటీసులు ఇచ్చే విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తీసుకొచ్చిన ‘ఫేస్‌లెస్’ (డిజిటల్) విధానానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణను హైకోర్టు తప్పుపట్టింది. ఫేస్‌లెస్ విధానం స్థానంలో సంబంధిత పరిధిలోని జ్యురిస్డిక్షన్ అసెసింగ్ ఆఫీసర్లే (జేఏఓ) నేరుగా నోటీసులు జారీ చేసేందుకు వీలు కల్పిస్తూ ఆదాయపు పన్ను చట్టం 1961ని సవరిస్తూ కొత్తగా చేర్చిన సెక్షన్ 147ఏను హైకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. ఈ సెక్షన్‌ను రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో ఫేస్‌లెస్ విధానం ద్వారా కాకుండా జేఏఓలు నేరుగా సెక్షన్ 148, 148ఏ కింద జారీ చేసిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా కొట్టేసింది. ఇవన్నీ కూడా అధికార పరిధి దాటి ఇచ్చినవేనని తేల్చి చెప్పింది. ‘ఈ–అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ స్కీమ్, 2022’ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత జేఏఓలకు సెక్షన్ 148 కింద నోటీసు ఇచ్చే అధికారం లేదు. ఈ పథకం ప్రకారం పన్ను తప్పించుకున్న ఆదాయంపై ఇచ్చే నోటీసులు (సెక్షన్ 148), రీ–అసెస్మెంట్ చర్యలన్నీ (సెక్షన్ 147) కేవలం డిజిటల్/ఫేస్‌లెస్ పద్ధతిలోనే జరగాలి. అంతే తప్ప జేఏఓలు నేరుగా నోటీసులు ఇవ్వడానికి వీల్లేదు.’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.
సెక్షన్ 147ఏ ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు...
ఫైనాన్స్ యాక్ట్, 2026 ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961లో చేర్చిన సెక్షన్ 147ఏని, దానిని వెనుకటి తేదీ (రెట్రోస్పెక్టివ్) 01.04.2021 నుండి వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సవరణ రాజ్యాంగ మూల నిర్మాణంలో భాగమైన చట్టబద్ధ పాలన, అధికార విభజన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వివేక్ చంద్రశేఖర్, శ్రీచరణ్ తేలప్రోలు, వినోద్ కె.రెడ్డి, జ్యోతిరత్న అనుమోలు తదితరులు వాదించారు. అంతేకాక పన్ను చెల్లింపుదారులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తోందన్నారు. సెక్షన్ 147ఏ కింద జేఏఓలు ఇచ్చే నోటీసులు.. ‘ఫేస్‌లెస్’ పద్ధతికి సంబంధించిన సెక్షన్ 151ఏకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల అవి చెల్లవని వివరించారు.
కోర్టు తీర్పులను చెల్లకుండా చేయడానికే సెక్షన్ 147ఏ
జేఏవోలకు నోటీసులు ఇచ్చే అధికారాన్ని తిరిగి కల్పించడానికి, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను చెల్లకుండా చేయడానికి ప్రభుత్వం నాన్–ఓబ్స్టాంటే క్లాజ్ (ఇతర చట్ట నిబంధనలను అధిగమించడం) తెచ్చి, సెక్షన్ 147ఏ ద్వారా ‘అసెసిగ్ ఆఫీసర్’ నిర్వచనాన్ని మార్చడానికి ప్రయత్నించింది. రీ–అసెస్మెంట్ నోటీసులన్నీ సెక్షన్ 151ఏ ప్రకారం ‘ఫేస్‌లెస్’ పద్ధతిలోనే జరగాలని, జేఏఓలకు నేరుగా నోటీసులు ఇచ్చే పరిధి లేదని గతంలోనే హైకోర్టులు స్పష్టంగా చెప్పాయి.
సెక్షన్ 151ఏ ని లేదా అందులోని ఫేస్‌లెస్ పథకాన్ని అధికారికంగా సవరించకుండా, కేవలం సెక్షన్ 147ఏ ని తీసుకువచ్చి పాత తీర్పులను రద్దు చేయాలనుకోవడం న్యాయ సమీక్షలో నిలబడదు. 31.3.2026న ఆదాయపు పన్ను చట్టం 1961 చట్టం రద్దయింది. ఫైనాన్స్ యాక్ట్ 2026 ద్వారా 1961 చట్టంలో సెక్షన్ 147ఏను చేర్చారు. ఈ ఫైనాన్స్ యాక్ట్ 1.4.2026న అమల్లోకి వచ్చింది. కాబట్టి చట్ట సవరణ చేసే నాటికే 1961 చట్టం లేదు. అందువల్ల రద్దయిన చట్టానికి సవరణ చేసి తెచ్చిన సెక్షన్ 147ఏ చెల్లదు. – హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ


