గంగమ్మ మృతి కేసు దర్యాప్తు ఏమైంది? | High Court questions police on Gangamma case | Sakshi
Sakshi News home page

గంగమ్మ మృతి కేసు దర్యాప్తు ఏమైంది?

Jun 25 2026 5:04 AM | Updated on Jun 25 2026 5:04 AM

High Court questions police on Gangamma case

పోలీసులకు హైకోర్టు ప్రశ్న

సాక్షి, అమరావతి: దళిత మహిళ మాల గంగమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె కుమార్తె లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో చెప్పాలని హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. గంగమ్మ మృతి కేసు దర్యాప్తు పురోగతిపై స్టేటస్‌ రిపోర్ట్‌ను తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. అలాగే గంగమ్మ పోస్టుమార్టం నివేదికతో సహా అన్ని రికార్డులను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. అలాగే గంగమ్మ కుమార్తె లక్ష్మికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

పోస్టుమార్టం రిపోర్ట్‌ తారుమారు? 
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సీల్డ్‌ కవర్‌లో సమర్పించిన పత్రాలను ధర్మాసనం బుధవారం పరిశీలించింది. అనంతరం గంగమ్మ  పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమె ఎలా చనిపోయారని పోలీసులను ప్రశ్నించింది. దీనికి పోలీసుల తరఫు న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ, «కార్డియాక్‌ అరెస్ట్‌తో పాటు పలు ఇతర కారణాలతో గంగమ్మ మృతి చెందారని తెలిపారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు.  పిటిషనర్‌ ఆగమన్‌రాజ్‌ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, గంగమ్మ కుమార్తె లక్ష్మిని కలిసేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. గంగమ్మ పోస్టుమార్టం రిపోర్ట్‌ను సైతం పోలీసులు తారుమారు చేశారని తెలిపారు.

గంగమ్మ లాకప్‌డెత్‌! 
కర్నూలు జిల్లా బదినేహాల్‌కి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  హైకోర్టు  ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్‌పీ (క్రైమ్స్‌) కె.సుప్రజ నేతృత్వంలో 13 మందితో సిట్‌ ఏర్పాటయ్యింది. వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సిట్‌ గంగమ్మను, బేగరి దర్గప్పను కస్టడీలోకి తీసుకుంది.  అయితే సిట్‌ టార్చర్‌ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందిందన్న విమర్శలు గుప్పుమన్నాయి. ఆమె కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

టార్చర్‌కు గురైన  దర్గప్ప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో గంగమ్మ లాకప్‌డెత్‌ వ్యవహారం మరుగునపడి పోయే ప్రమాదం ఉందంటూ  ప్రకాశం జిల్లాకు చెందిన  ఆగమన్‌రాజ్‌  అనే యువకుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement