సాక్షి,విజయవాడ: నెల రోజుల క్రితం ఆచూకీ గల్లంతయిన గాదె సాయి కృష్ణ కేసుపై ఏపీ హైకోర్టులో ఈవాళ విచారణ జరిగింది. విచారణలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 29లోగా బాధితుణ్ని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేదంటే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. నెల రోజుల క్రితం ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’.. అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడలో మీడియా ఎదుట కన్నీటి పర్యంతరమయ్యారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు.
తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సమయంలో ఆమె న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంక పోలీసులు గతనెల (మే)9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడంలేదన్నారు. తరువాత సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు.

తన సెల్‌ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపర్చలేదంటే అతడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు.
ఈ నేపథ్యంలో తన కుమారుడు గురించి సమాచారం ఇవ్వాలని కోరుతూ గాదె సాయికృష్ణ తల్లి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని సీఐ నాగరాజును ఆదేశించింది.


