సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి జారీ చేసిన న్యాయస్థానం
సీబీఐకి ఇవ్వాలన్న జోగి రమేష్ పిటిషన్‌పై స్పందించిన కోర్టు
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా
నకిలీ మద్యం కేసులో రాజకీయ కోణంలో దర్యాప్తు
అద్దేపల్లి జనార్దనరావు వీడియో వెనుక కుట్ర ఉంది
అందువల్లే సీబీఐ దర్యాప్తును కోరుతున్నాం...
ఈ మేరకు నిందితుడు పిటిషన్ దాఖలు చేయొచ్చు
దీన్ని సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది
హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది పొన్నవోలు
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులిస్తూ... న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జోగి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు వెసులుబాటునిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. దీనికిముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం.
మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్‌ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు.
మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, , ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.

దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు
ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.


