దుర్గప్ప మెడికల్‌ రికార్డులన్నీ మా ముందుంచండి | High Court clarification in Gangamma lockup death case | Sakshi
Sakshi News home page

దుర్గప్ప మెడికల్‌ రికార్డులన్నీ మా ముందుంచండి

Jun 24 2026 5:16 AM | Updated on Jun 24 2026 5:17 AM

High Court clarification in Gangamma lockup death case

గంగమ్మ లాకప్‌డెత్‌ కేసులో హైకోర్టు స్పష్టీకరణ

కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు ధర్మాసనం ఆదేశం

స్వయంగా జైలుకెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వండి

అవసరమైతే అతన్ని ఆసుపత్రికి తరలించండి

సాక్షి, అమరావతి : దళిత మహిళ మాల గంగమ్మ లాకప్‌డెత్‌ కేసులో హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. గంగమ్మతో పాటు పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగరి దుర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేయాలని గత వారం ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు, తాజాగా అతని మెడికల్‌ రికార్డులన్నింటినీ సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అలాగే జుడీషియల్‌ కస్టడీలో ఉన్న దుర్గప్ప వద్దకు వెళ్లి, అతని ప్రస్తుత ఆరోగ్య స్థితిని పరిశీలించి.. అందుకు సంబంధించిన నివేదికను సైతం తమ ముందుంచాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అవసరమైతే అతన్ని ఆసుపత్రికి తరలించాలని కూడా చెప్పింది. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్‌ గ్రామానికి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వీరేంద్ర అదృశ్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ (క్రైమ్‌) కె.సుప్రజ నేతృత్వంలో 13 మందితో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మే 8న డీజీపీ ఉత్తర్వులిచ్చారు. 

వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సుప్రజ నేతృత్వంలోని సిట్‌.. మాల గంగమ్మను, బేగరి దుర్గప్పను కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా హింసించారు. సిట్‌ టార్చర్‌ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందారు. గంగమ్మ, దుర్గప్పలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని టార్చర్‌ చేసిన సంగతి గ్రామస్తులందరికీ తెలుసు. టార్చర్‌కు గురైన దుర్గప్ప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగమ్మ మృతితో భయపడిన పోలీసులు దుర్గప్పను ఆసుపత్రిలో చేర్పించారు. వాస్తవానికి గంగమ్మ లాకప్‌డెత్‌కు దుర్గప్ప ప్రత్యక్ష సాక్షి. 

దుర్గప్ప వాంగ్మూలం నమోదు కోసం పిటిషన్‌ 
దుర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో గంగమ్మ లాకప్‌డెత్‌ వ్యవహారం మరుగునపడి పోయే ప్రమాదం ఉండటంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దుర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాసుకుర్తి ఆగమన్‌రాజ్‌ అనే యువకుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం, దుర్గప్ప చికిత్స పొందున్న ఆసుపత్రికి వెళ్లి అతని వాంగ్మూలాన్ని నమోదు చేసి తమ ముందుంచాలని సంబంధిత మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. 

ఈ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ, ధర్మాసనం ఆదేశాల మేరకు దుర్గప్ప వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ నమోదు చేశారన్నారు. దుర్గప్ప ప్రస్తుతం జుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. దీంతో ధర్మాసనం.. మేజిస్ట్రేట్‌ నమోదు చేసిన దుర్గప్ప వాంగ్మూలాన్ని పరిశీలించింది.­­­­గంగమ్మ కుమార్తెకూ పోలీసుల బెదిరింపులుఈ సమయంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మృతురాలు గంగమ్మ కుమార్తె లక్ష్మీని పోలీసులు బెదిరించారన్నారు. ఆమె ఆచూకీ తెలియడం లేదని తెలిపారు. 

ఆమె తన స్వగ్రామంలో కూడా లేదని, ఫోన్‌ సైతం స్విచ్ఛాఫ్‌ వస్తోందన్నారు. ఈ వాదనను ఎస్‌జీపీ ప్రణతి తోసిపుచ్చారు. గంగమ్మ కుమార్తె అందుబాటులోనే ఉన్నారన్నారు. గంగమ్మ మృతికి సంబంధించిన అన్ని రికార్డులను కర్నూలు జీజీహెచ్‌ నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. దుర్గప్ప మెడికల్‌ రికార్డుల కోసం ఆసుపత్రి వర్గాలకు దరఖాస్తు చేయాల్సి ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దుర్గప్పకు సంబంధించిన అన్ని మెడికల్‌ రికార్డులను సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అలాగే కర్నూలు జైలుకు వెళ్లి.. అక్కడ ఉన్న దుర్గప్పను పరిశీలించి అతని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement