
కర్నూలు జిల్లా ఆదోనిలోని గణేష్ సర్కిల్ కాలనీలో నడుము లోతు నీటిలో స్థానికులు
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు
పొంగిపొర్లిన వాగులు
లోతట్టు ప్రాంతాలు జలమయం
దేవనకొండలో 142.6 మి.మీ. వర్షపాతం నమోదు
సాక్షి, అమరావతి/వాకాడు/కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం నాటికి ఉత్తర, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ఎగసి పడుతున్న సముద్రం అలలు
వాయుగుండం ప్రభావంతో శనివారం తిరుపతి జిల్లా వాకాడు మండలం, తూపిలిపాళెం సముద్ర తీరంలో అలలు 4 మీటర్లు ఎత్తుకు ఉవ్వెత్తున ఎగసి పడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో సముద్రంపై మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు ఎవ్వరూ వెళ్లరాదని అధికారులు ఆదేశించారు.
నంద్యాల జిల్లాలో ఎడతెరపిలేని వర్షం
నంద్యాల జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కుందూ, మద్దిలేరు, పాలేరు వాగులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కర్నూలులో కుండపోత
కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఒకే రోజు జిల్లాలో 62 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దేవనకొండలో 142.6 మి.మీ., అత్యల్పంగా ఆలూరులో 25.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామంలో భారీ వర్షం కారణంగా 30 గొర్రెలు మరణించాయి. అధిక వర్షాల వల్ల పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాటా సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో సెపె్టంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ. కాగా, 27 రోజుల్లో 199.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.