
కొండవీటి వాగుకు ఉప్పొంగిన వరద ప్రవాహం
గుంటూరు నుంచి రాజధానికి రాకపోకలు బంద్
ఉప్పొంగిన కోటేళ్లవాగు, ఎర్రవాగు, పాలవాగు.. సచివాలయానికి అధికారులు వెళ్లలేక నానా ఇబ్బందులు
40 వేల ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు
కొండవీటి వాగు ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టని ప్రభుత్వం.. అందుకే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని రైతుల ఆరోపణ
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడికొండ : రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయంలోపు జిల్లాలో సగటున 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది.
రాజధాని నిర్మాణాలతో స్వరూపం కోల్పోయిన వాగులు..
రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్నవాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి.
ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించకుండా కొండవీటి వాగు వరదను గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు.. తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ఉధృతికి ముంపుబారిన పడి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయ చర్యలు నిల్..
ఇక మంగళవారం రాత్రి తాడికొండ మండలంలో 225 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 180.2 మి.మీ., మేడికొండూరు 140.2, ఫిరంగిపురం 111.2, మంగళగిరి 194.8 మి.మీ., వర్షం కురిసింది. ఈ వర్షం నీరు అంతా కొండవీడు కొండల మీదుగా మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల మీదుగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరాల్సి ఉంది. కానీ, కొండవీటి వాగు ప్రక్షాళనకు రూ.234 కోట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకంలో ఎక్కడా ఎగువ నుంచి దిగువకు వరద నీరు పూర్తిగా వచ్చేలా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు.

నిజానికి.. వందల ఏళ్లుగా కొండవీటి వాగు పల్లపు ప్రాంతమైన రాజధాని ప్రాంతం నుంచే ప్రవహించేది. అయితే, ప్రస్తుతం దానిని మూసేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లుచేయకపోవడంవల్లే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు.. కాసుల కక్కుర్తి కోసం రాజధానిలో రిజర్వాయర్ల పేరుతో ఇతర నిర్మాణాలను చేపట్టడం కూడా వరద ముంపునకు కారణమైంది. దీంతో.. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం ఇప్పుడీ ప్రాంతానికి వచ్చింది. ఇటు పంటలు మునగడంతో పాటు గ్రామాల్లో కూడా నీరు కదిలే పరిస్థితి లేక రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.

రాకపోకలకు తీవ్ర అంతరాయం..
ఇదిలా ఉంటే.. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అమరావతి–గుంటూరు రోడ్డే. అయితే, ఈ మార్గంలో లాం వద్ద కొండవీటి వాగు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మాణం హామీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు.

» మరో మార్గం.. జాతీయ రహదారి మీదుగా కంతేరు–తాడికొండ మధ్యలో ఎర్రవాగు వద్ద కూడా వరద పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
» మంగళగిరి మీదుగా రాజధానికి ప్రవేశించాలన్నా నీరుకొండ–పెదపరిమి రహదారి వద్ద భారీ వర్షం కురిస్తే వారం పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐనవోలు మీదుగా కూడా రహదారి పూర్తిగా దిగ్బంధం అవుతుంది.
» ఒక్క చంద్రబాబు నివాసం మీదుగా వచ్చే కరకట్ట రహదారి మినహా రాజధానికి రావాలంటే ఏ ఒక్క రోడ్డు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు.