
సాక్షి, అమరావతి: విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసింది. చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో 78.5 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా పెద్దరావీడులో 59.2, తిరుపతి జిల్లా పుత్తూరులో 58.7, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 37 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.
నేడు పలు ప్రాంతాల్లో భారీవర్షాలు
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలుంటే సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై అధికవర్షం పడుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 42.4 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంట, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 42.1, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 41.3, కర్నూలు జిల్లా కామవరంలో 41నిడిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42ని–43 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, గంగవరం మండలాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని, 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు హోర్డింగ్స్, చెట్లకింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలకు సమీపంలో ఉండరాదని సూచించింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.