
ఏప్రిల్ నుంచి జూలై వరకూ 343 మంది మృతి
విపత్తు నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్లే
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల వెల్లడి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా జల వాతావరణ విపత్తుల్లో అత్యధిక మృతులు నమోదైన రాష్ట్రంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకూ కేవలం నాలుగు నెలల్లో రాష్ట్రంలో 343 మంది జల విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తేల్చిన ఈ నిజం– రాష్ట్ర విపత్తు నిర్వహణలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు..

⇒ ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం జల వాతావరణ విపత్తుల కారణంగా 1,626 మంది మృతి చెందారు.
⇒ జలాశయాల దగ్గర ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది జలాశయాల్లో దిగి మృతి చెందుతున్నారు.
⇒ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయకపోవడంతో చాలా మంది ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకుంటున్నాయి.
⇒ మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (243), హిమాచల్ ప్రదేశ్ (195) నిలిచాయి.
⇒ జల విపత్తులు సంభవించిన రాష్ట్రాల్లో నష్టాలను అంచనా వేసిన తరువాత జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందని గణాంకాల నివేదిక పేర్కొంది.
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 15వ తేదీ నాటికి జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్ర వాటాగా 22 రాష్ట్రాలకు రూ.9,578.40 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర హోమంత్రిత్వ శాఖ వెల్లడించింది.