
విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో గురువారం భారత వాతావరణశాఖ ఏపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలుస్తోంది.
పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా గురువారం పలుజిల్లాలో భారీ వర్షాలు కొనసాగాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.