
కేంద్రాల ద్వారా కొన్నది 10వేల టన్నులే
క్వింటా రూ.10వేల నుంచి రూ.12వేల చొప్పున కొనుగోలు చేసింది 912 టన్నులే..
లో, మీడియం గ్రేడ్‌ల పేరుతో కొన్నది 9వేల టన్నులే
ఇంకా రైతుల వద్ద 30వేల టన్నుల వరకు పొగాకు నిల్వలు
పొగాకు కొనుగోళ్లకు రూ.260 కోట్లు అవుతుందని అంచనా
ఇప్పటి వరకు కొన్నదే రూ.80కోట్ల విలువైన పొగాకు మాత్రమే..
అయినా నేటికీ పైసా ఇవ్వని ప్రభుత్వం
డబ్బుల కోసం అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
సాక్షి, అమరావతి: నల్లబర్లీ పొగాకు రైతుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పూర్తిగా ఆరబెట్టిన తర్వాత నాణ్యమైన పొగాకును ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నా... ప్రైవేటు కంపెనీల మాదిరిగా ‘క్వాలిటీ లేదు’ అనే సాకుతో కొర్రీలు వేస్తూ రైతులకు చుక్కలు చూపిస్తోంది. రైతులు తీసుకొచి్చన పొగాకులో 90శాతానికి పైగా లో, మీడియం క్వాలిటీగానే కొనుగోలు కేంద్రాల సిబ్బంది పరిగణిస్తున్నారు. కేవలం 5 నుంచి 10శాతం పొగాకును మాత్రమే కాస్త క్వాలిటీగా ఉందని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలు కావొస్తున్నా రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.
30 క్వింటాళ్లు కొంటామని మెసేజ్‌లు... యార్డుకు వెళితే 20 క్వింటాళ్లే అట!
పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి మార్కెట్ యార్డుకు వెళ్లిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. ఆఘమేఘాల మీద గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 24 కేంద్రాలు ఏర్పాటుచేసి పొగాకు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. రైతుల వద్ద పేరుకుపోయిన నిల్వల్లో 33వేల టన్నులు కంపెనీల ద్వారా కొనుగోలు చేయిస్తామని, మిగిలిన 20వేల టన్నులను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆర్భాటంగా చెప్పింది.
నాణ్యతతో సంబంధం లేకుండా చివరి ఆకు వరకు క్వింటా రూ.12వేలు చొప్పున కొంటామని ప్రకటించింది. ఆచరణలోకి వచ్చేసరికి యార్డుల్లో నమోదు చేసుకున్న రైతుల నుంచి 30 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తామని మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆ మేరకు లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా ఖర్చులన్నీ భరిస్తూ తీసుకువెళితే 20 క్వింటాళ్లకు మించి కొనడం లేదు. దీంతో తెచ్చిన పొగాకును ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు.
క్వాలిటీ పేరిట రైతుకు శఠగోపం
» పొగాకు కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో హై క్వాలిటీ(హెచ్‌డీఆర్)కి క్వింటా రూ.10వేల నుంచి రూ.12వేలు, మీడియం క్వాలిటీ (హెడ్‌డీఎం)కి రూ.7వేల నుంచి రూ.9వేలకు, లో క్వాలిటీ (హెచ్‌డీఎక్స్)కి రూ.4వేల నుంచి రూ.6వేలు చొప్పున ధరలు నిర్ణయించారు.
» జూన్ 8వ తేదీన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా, ఆగస్టు 9వ తేదీ(శనివారం) నాటికి అతికష్టమ్మీద 5,682 మంది రైతుల నుంచి 10,197 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. నాణ్యత పేరిట అడ్డగోలుగా ధరలో కోత విధిస్తున్నారు.
» హైక్వాలిటీ పొగాకు 912 టన్నులు(8.9శాతం) సేకరించారు. హై క్వాలిటీకి రూ.12 వేల వరకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ అత్యధిక మంది రైతులకు గరిష్టంగా రూ.10వేలకు మించి ధర నిర్ణయించడం లేదు.
» మీడియం క్వాలిటీ పేరిట 4,323 టన్నులు(42.4శాతం), లో క్వాలిటీ పేరిట 4,962 టన్నులు(48.7శాతం) సేకరించారు.
» మీడియం క్వాలిటీ పొగాకుకు క్వింటా రూ.7వేలు, లో కేటగిరీ పొగాకు రూ.4వేలకు మించి ధర దక్కడం లేదు.
» వాస్తవానికి 20వేల టన్నులకు క్వింటా రూ.12వేలు చొప్పున రూ.260 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఇప్పటి వరకు సేకరించిన పొగాకు విలువ రూ.80 కోట్లు మాత్రమే.
» ఇప్పటికీ రైతుల వద్ద మరో 30వేల టన్నుల వరకు పొగాకు నిల్వలు ఉన్నాయి. కంపెనీలు ముఖం చాటేయడంతో ఏం చేయాలో తెలియక రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు.
పైసా విడుదల చేయని ప్రభుత్వం
ఇప్పటి వరకు రూ.80 కోట్ల విలువైన పొగాకు సేకరించగా, తొలి విడత చెల్లింపుల కోసం రూ.55 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ఆరి్థక శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. దీంతో రెండు నెలలుగా పొగాకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు డబ్బులు అందక నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి ఎకరాకు రూ.లక్షన్నర వరకు పెట్టుబడులు పెట్టామని, వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు.
మరోవైపు ఈ నెలాఖరులోపు కొనుగోలు కేంద్రాలకు పుల్‌స్టాప్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పొగాకు కొనుగోలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి రూ.209 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి (పీఎస్‌ఎఫ్) నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని మార్క్‌ఫెడ్ అభ్యర్థనను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.