
ప్రకాశం బ్యారేజీ నుంచి 3,97,250 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరదెత్తిన కృష్ణమ్మ
శ్రీశైలం నుంచి 2.54, సాగర్ నుంచి 2.96, పులిచింతల నుంచి 3.64 లక్షల
క్యూసెక్కులు దిగువకు.. బుడమేరు, మున్నేరు, కొండవీటి వాగు నుంచి భారీ వరద
భారీ వర్షాలకు విజయవాడలో ముగ్గురు బలి.. ‘కృష్ణా’లో ఇద్దరు గల్లంతు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు ఉప నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 9 గంటలకు వరద 3,97,250 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. అంతే పరిమాణంలో 70 గేట్ల ద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 4 నుంచి 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా.
ఈ నేపథ్యంలో.. కృష్ణా నదీ తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో బుధవారం రాత్రికి 10–15 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్నేరు, కొండవీటి వాగు తదితర వాగుల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద వస్తోంది.
విజయవాడలో పలు ప్రాంతాలు జలమయం
భారీ వర్షాలకు విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్రెయిన్లు పొంగడంతో రోడ్ల మీద 4 అడుగుల మేర నీరు నిలిచింది. వందల సంఖ్యలో ఇళ్లలోకి నీరుచేరింది. బుడమేరు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పమిడిముక్కల మండలం ఐనంపూడిలో పిడుగుపడి పశువులపాక దగ్ధం కావటంతో రెండు గేదెలు, ఒక ఎద్దు మృతిచెందాయి.
కాజ టోల్‌గేటు వద్ద నిలిచిన ట్రాఫిక్
మంగళగిరి నగర పరిధిలోని కాజ టోల్‌గేటు వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజా వద్ద మూడడుగుల నీరు ఉండడంతో గుంటూరు నుంచి విజయవాడ వైపు పలు లైన్లలో రాకపోకలు నిలిపివేశారు. మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో నీరు నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రధాన రహదారులపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిపోయాయి. గుంటూరు రోడ్లు, డ్రెయిన్లు, మార్కెట్లు, జలమయమయ్యాయి.
పిడుగురాళ్ల మండలం జూలకల్లు, గుత్తికొండ, దాచేపల్లి, కారంపూడి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడక్కడ బ్రిడ్జిలు, చప్టాలు కూలిపోయాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని దొంగలవాగు ఉధృతంగా ప్రవహించటంతో కర్నూలు రహదారిలో కొత్తూరు వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద బుధవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
‘పశ్చిమ’లోనూ భారీ వర్షం
పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, ఉండి నియోజకవర్గాల్లో కుండపోత వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్ర«దాన రహదారులపై సైతం వర్షం నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇక్కట్లకు గురయ్యారు. ఏలూరు జిల్లాలోనూ కుండపోత వర్షం కురిసింది. కాకినాడ, జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కనిపించని విధంగా జలమయమయ్యాయి.
మూడు జిల్లాల్లో పంటలకు నష్టం
వర్షాల వల్ల ఖరీఫ్ పంటలు నీటమునుగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ మూడు జిల్లాల పరిధిలో 161 గ్రామాల్లో 1.12 లక్షల ఎకరాల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. 52,924 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1.02 లక్షల ఎకరాల్లో వరి, 8,550 ఎకరాల్లో పత్తి, వెయ్యి ఎకరాల్లో మినుము, 300 ఎకరాల్లో వేరుశనగ పంటలు ముంపునకు గురయ్యాయి.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వందల ఎకరాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడ వరి పంటలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట పంటలు నీటమునిగి కుళ్లిపోతుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నంద్యాల జిల్లాలోనూ వరి పైరు నీట మునిగింది. మినుము, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది.
అప్రమత్తంగా ఉండండి: సీఎం
రాష్ట్రంలో వచ్చే రెండు, మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సీఎం చంద్రబాబు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించాలని చెప్పారు.
బెజవాడలో ముగ్గురు దుర్మరణం
భారీ వర్షాలకు విజయవాడలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పాతబస్తీ గులాం మొహిద్దీన్ వీధిలో భూగర్భ డ్రైనేజీ మరమ్మతుల నిమిత్తం నగరపాలక సంస్థ సిబ్బంది తీసిన గోతిలోపడి కృష్ణా జిల్లా హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు టీవీ మధుసూదనరావు మరణించాడు. మరో ఘటనలో.. పాతబస్తీ సుబ్బరామయ్య వీధిలోని జెండా చెట్టు వద్ద ప్రధాన అవుట్‌ఫాల్ డ్రెయిన్ సమీపంలో ముర్తుజా అనే వ్యక్తి వర్షపు నీటిలో పడి కొట్టుకుపోయాడు.
లయోలా కాలేజీ సమీపంలో చెట్టు పడటంతో ఓ వ్యక్తిపై ప్రాణాలు విడిచాడు. కాగా.. కృష్ణా నదిలో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ఇసుకను తోడే బుల్డోజర్ స్థానం మార్చేందుకు దిగిన కామేశ్వరరావు (19), వీర ఉపేంద్ర (22) గల్లంతు కాగా.. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.