breaking news
Krishna riveer
-
పాత రికార్డులను తోడేసిన వరద
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. కృష్ణా పరీవాహక పరిధిలోని శ్రీశైలం, పులిచింతల జలాశయాలతోపాటు గోదావరి పరీవాహక పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల చరిత్రలోనే అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం వంటి ఇతర ప్రాజెక్టులకు సైతం రికార్డు స్థాయి వరదలొచ్చాయి. సాగునీటి రంగ పరిభాషలో జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 మధ్య కాలాన్ని నీటి సంవత్సరంగా పరిగణిస్తారు. 2015–16లో కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు చరిత్రలోనే అత్యల్ప వరదలు రాగా, సరిగ్గా దశాబ్దం తర్వాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు రావడం గమనార్హం. శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీలు ప్రస్తుత నీటి సంవత్సరం (2024–25)లో ఇప్పటి వర కు శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీల భారీ వరద వచ్చింది. ఈ ప్రాజెక్టుకు అత్యధికంగా 1994– 95లో 2,039.23 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఆ తర్వాత 2022–23లో దానికంటే స్వల్ప అత్యధికతో 2,039.87 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశై లం జలాశయం నిర్మాణం 1960లో ప్రారంభించగా 1980 జూలై 26న నిర్మాణం పూర్తయ్యింది. 1984–85 నుంచి జలాశయంలో పూర్తిస్థాయి నిల్వలను కొనసాగిస్తున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. సాగర్‌కూ నాలుగో అత్యధిక వరద ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు సాగర్‌కు 1,766.24 టీఎంసీల వరద వచ్చింది. సాగర్ చరిత్రలోనే ఇది నాలుగో అత్యధిక వరద. 1955లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 1967లో పూర్తయిన సాగర్‌కు 1975–76లో అత్యధికంగా 2,639.9 టీఎంసీల వరద వచ్చింది. ఆ తర్వాతి కాలంలో కృష్ణానదిపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. దీంతో సాగర్‌కు వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. 1978–79లో 1,966.75 టీఎంసీలు, 1994–95లో 1,885.64 టీఎంసీల అత్యధిక వరదలు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గడిచిన 40 ఏళ్లలో సాగర్‌కు అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. పులిచింతల జలాశయానికి... సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయ చరిత్రలో అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. ఈ ఏడాది 1,477.1 టీఎంసీల వరద రాగా, అంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,285.86 టీఎంసీల వరద వచ్చింది. » ఈ ఏడాది కృష్ణానదికి నిరంతరంగా భారీ వరదలు కొనసాగడంతో ప్రకాశం బరాజ్ నుంచి రికార్డు స్థాయిలో 1,628 టీఎంసీల కృష్ణా జలాలను సముద్రంలో విడుదల చేశారు. 1990–91 తర్వాత ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన అత్యధిక వరద ఇదే కావడం గమనార్హం. ఇంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,331. 55 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు. గోదావరిలోనూ .... గోదావరి పరీవాహకంలోని సింగూరు జలాశయానికి 1998–99లో అత్యధికంగా 176.56 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఈ ఏడాది చరిత్రలోనే అత్యధికంగా 230.49 టీఎంసీల వరద వచ్చింది. » నిజాంసాగర్ ప్రాజెక్టుకు 1983–84లో అత్యధికంగా 328.93 టీఎంసీల వరద వచ్చింది. ఈ ఏడాది నిజాంసాగర్‌కు 306.83 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది. » శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అత్యధికంగా 1983–84లో 1,168.57 టీఎంసీల వరద రాగా, 1988–89లో 928.18 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది. ఈ ఏడాది జలాశయానికి 927.40 టీఎంసీల మూడో అత్యధిక వరద రావడం గమనార్హం. » శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 1,444.22 టీఎంసీల వరద ఈ ఏడాదే వచ్చింది. 2022–2023లో జలాశయానికి అత్యధికంగా 1,235.76 టీఎంసీల వరద రాగా, 2021–22లో 1077.23 టీఎంసీల ప్రవాహం వచ్చింది. 2015–16లో పూర్తయిన ఈ ప్రాజెక్టు చరిత్రలో ఏడాదికి 1,000 టీఎంసీలకు పైగా వరద మూడు పర్యాయాలు మాత్రమే వచ్చింది. » ధవళేశ్వరం బరాజ్ నుంచి ఈ ఏడాది 4,428 టీఎంసీల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలారు. -
కృష్ణవేణి.. ఉగ్రరూపిణి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు ఉప నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 9 గంటలకు వరద 3,97,250 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. అంతే పరిమాణంలో 70 గేట్ల ద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 4 నుంచి 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదీ తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో బుధవారం రాత్రికి 10–15 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్నేరు, కొండవీటి వాగు తదితర వాగుల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద వస్తోంది. విజయవాడలో పలు ప్రాంతాలు జలమయం భారీ వర్షాలకు విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్రెయిన్లు పొంగడంతో రోడ్ల మీద 4 అడుగుల మేర నీరు నిలిచింది. వందల సంఖ్యలో ఇళ్లలోకి నీరుచేరింది. బుడమేరు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పమిడిముక్కల మండలం ఐనంపూడిలో పిడుగుపడి పశువులపాక దగ్ధం కావటంతో రెండు గేదెలు, ఒక ఎద్దు మృతిచెందాయి. కాజ టోల్‌గేటు వద్ద నిలిచిన ట్రాఫిక్ మంగళగిరి నగర పరిధిలోని కాజ టోల్‌గేటు వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజా వద్ద మూడడుగుల నీరు ఉండడంతో గుంటూరు నుంచి విజయవాడ వైపు పలు లైన్లలో రాకపోకలు నిలిపివేశారు. మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో నీరు నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రధాన రహదారులపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిపోయాయి. గుంటూరు రోడ్లు, డ్రెయిన్లు, మార్కెట్లు, జలమయమయ్యాయి. పిడుగురాళ్ల మండలం జూలకల్లు, గుత్తికొండ, దాచేపల్లి, కారంపూడి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడక్కడ బ్రిడ్జిలు, చప్టాలు కూలిపోయాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని దొంగలవాగు ఉధృతంగా ప్రవహించటంతో కర్నూలు రహదారిలో కొత్తూరు వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద బుధవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ‘పశ్చిమ’లోనూ భారీ వర్షం పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, ఉండి నియోజకవర్గాల్లో కుండపోత వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్ర«దాన రహదారులపై సైతం వర్షం నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇక్కట్లకు గురయ్యారు. ఏలూరు జిల్లాలోనూ కుండపోత వర్షం కురిసింది. కాకినాడ, జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కనిపించని విధంగా జలమయమయ్యాయి. మూడు జిల్లాల్లో పంటలకు నష్టం వర్షాల వల్ల ఖరీఫ్ పంటలు నీటమునుగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ మూడు జిల్లాల పరిధిలో 161 గ్రామాల్లో 1.12 లక్షల ఎకరాల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. 52,924 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1.02 లక్షల ఎకరాల్లో వరి, 8,550 ఎకరాల్లో పత్తి, వెయ్యి ఎకరాల్లో మినుము, 300 ఎకరాల్లో వేరుశనగ పంటలు ముంపునకు గురయ్యాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వందల ఎకరాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడ వరి పంటలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట పంటలు నీటమునిగి కుళ్లిపోతుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నంద్యాల జిల్లాలోనూ వరి పైరు నీట మునిగింది. మినుము, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. అప్రమత్తంగా ఉండండి: సీఎంరాష్ట్రంలో వచ్చే రెండు, మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.సీఎం చంద్రబాబు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించాలని చెప్పారు. బెజవాడలో ముగ్గురు దుర్మరణం భారీ వర్షాలకు విజయవాడలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పాతబస్తీ గులాం మొహిద్దీన్ వీధిలో భూగర్భ డ్రైనేజీ మరమ్మతుల నిమిత్తం నగరపాలక సంస్థ సిబ్బంది తీసిన గోతిలోపడి కృష్ణా జిల్లా హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు టీవీ మధుసూదనరావు మరణించాడు. మరో ఘటనలో.. పాతబస్తీ సుబ్బరామయ్య వీధిలోని జెండా చెట్టు వద్ద ప్రధాన అవుట్‌ఫాల్ డ్రెయిన్ సమీపంలో ముర్తుజా అనే వ్యక్తి వర్షపు నీటిలో పడి కొట్టుకుపోయాడు. లయోలా కాలేజీ సమీపంలో చెట్టు పడటంతో ఓ వ్యక్తిపై ప్రాణాలు విడిచాడు. కాగా.. కృష్ణా నదిలో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ఇసుకను తోడే బుల్డోజర్ స్థానం మార్చేందుకు దిగిన కామేశ్వరరావు (19), వీర ఉపేంద్ర (22) గల్లంతు కాగా.. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. -
‘కృష్ణా’కు వారసులెవరు?
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో చర్చ ‘ఒక తండ్రి వారసులు పక్కవారి వాటాలు కోరతారా’ అన్న అత్యున్నత న్యాయస్థానం ఆ ‘వారసులు’ 2 తెలుగు రాష్ట్రాలేనా.. లేక మహారాష్ట్ర, కర్ణాటకలా? కృష్ణా నది జలాలను వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలూ వారసులే అంటున్న తెలంగాణ హైదరాబాద్: కృష్ణా నదికి ‘వారసుల’ అంశం తీవ్ర స్థాయిలో చర్చకు తెరలేపింది. ‘వారసుడు తల్లిదండ్రుల నుంచే ఆస్తులు కోరతాడు కానీ ఇతరుల నుంచి కోరడు కదా..’ అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు నీటి కేటాయింపుల వివాదం కేవలం తెలుగు రాష్ట్రాల మధ్యేనా?.. లేక నీటిని వినియోగించుకుంటున్న నాలుగు రాష్ట్రాలకూ వర్తిస్తుందా? అన్న అంశంపై బుధవారం (6వ తేదీన) సుప్రీంకోర్టులో జరిగే విచారణ కీలకంగా మారింది. కృష్ణా జలాలను వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలూ వారసులేనని కోర్టుకు తెలంగాణ స్పష్టం చేయనుంది. అందరూ వారసులే: కృష్ణా జలాలను వినియోగించుకుంటున్న నాలుగు రాష్ట్రాలూ వారసులేనని తెలంగాణ బలంగా చెబుతోంది. నీటిని అందరికీ సమానంగా పంచాలని కోరుతోంది. ఈమేరకు సుప్రీం ముందు వాదించేందుకు ప్రత్యేక నోట్‌ను సైతం తయారుచేసింది. ఆ నోట్ ప్రకారం.. కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీకి మొత్తం కేటాయింపులు 811 టీఎంసీలుకాగా.. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్ నుంచి 369 టీఎంసీల మేర మాత్రమే వర్షాల ద్వారా నీటి లభ్యత ఉంది. మిగతా 442 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావాల్సిందే. అలా అయితేనే వాస్తవ కేటాయింపుల లెక్క సరితూగుతుంది. వారు లేకుండా వాటాలు తేలవు. కృష్ణాలో కలిసే భీమా నదికి ఉపనది అయిన కాగ్నా తెలంగాణ నుంచి కర్ణాటకకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి తెలంగాణలోకి వచ్చి భీమాలోనే కలుస్తుంది. అప్పుడు కర్ణాటకకు తెలంగాణ కింది రాష్ట్రమా? లేక పైరాష్ట్రమా?. ఈ విషయంలో ఎవరు ఎవరికి వారసులు? తుంగభద్ర నది సైతం కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవహించి.. అక్కడి నుంచి తిరిగి కర్ణాటకకు వెళ్లి, ఆ తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య ఉమ్మడి సరిహద్దుగా ప్రవహిస్తుంది. ఈ విషయంలో వారసులెవరో ఎలా తేలుస్తారు. మహారాష్ట్రలో లభ్యమయ్యే 80 శాతం నీరు ఒక్క కే1 సబ్బేసిన్లోనే లభ్యమవుతోంది. ఈ కే1 నీటినే ఏపీ, కర్ణాటకలు పంచుకోవాలి. ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో సబ్బేసిన్ల నుంచి ప్రధాన కృష్ణా బేసిన్‌లోకి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే... అటువంటి పరిస్థితుల్లో నీటి విడుదల ఎలా? ప్రధాన బేసిన్లో నీరు ఎక్కువగా ఉండి సబ్ బేసిన్లో లభ్యత తక్కువగా ఉంటే అప్పుడు సబ్ బేసిన్ ప్రాజెక్టులకు నీటిని ఎలా కేటాయిస్తారు? ఈ అంశాల దృష్ట్యా స్థిరాస్తులు పంచినట్లుగా నీటి పంపకాలు చేయడం కుదరదు. ఒకరిపై ఒకరు ఆధారపడుతూ, అందరూ వినియోగిస్తున్నపుడు కృష్ణా నదికి అంతా వారసులే అవుతారు. సెక్షన్ 89 పరిధి ఏంటి? కృష్ణా నది నీటి పునఃకేటాయింపు కోరుతూ వేసిన పిటిషన్లపై గత విచారణ సందర్భంగా... రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89ను తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ప్రస్తావించాయి. గతంలో ఏ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేయకున్నా.. నీటి ప్రవాహంలో లోటు ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలను ట్రిబ్యునల్ పర్యవేక్షించాలని ఆ సెక్షన్ చెబుతున్న అంశాన్ని కోర్టు దృష్టికి తె చ్చాయి. నీటి కరువు పరిస్థితుల్లో ఎగువన ఉన్న రాష్ట్రాలు దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుం దని పేర్కొన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఏయే ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు? అన్న దానిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని, దానికి అన్ని రాష్ట్రాల వాదనలను సమీక్షించాలని కోరాయి. దీనిపై స్పందించిన సుప్రీం.. ‘ఈ సెక్షన్ ప్రకారం వారసులు (తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు) ఆస్తులు, అప్పులు పంచుకున్నట్లు నీటిని పంచుకోవాలి తప్పితే, ఇతరుల నుంచి కాదు కదా?’ అని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ, తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి.


