కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రవాహాలు
శ్రీశైలం, జూరాల, సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు చరిత్రలోనే అత్యధిక ఇన్‌ఫ్లోలు
ఎగువన ఆల్మట్టి, శ్రీశైలం కట్టినా సాగర్‌కు నాలుగో అత్యధిక వరద ప్రవాహం
రికార్డు స్థాయిలో సముద్రంలో కలిసిన 1,628 టీఎంసీల కృష్ణా జలాలు
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. కృష్ణా పరీవాహక పరిధిలోని శ్రీశైలం, పులిచింతల జలాశయాలతోపాటు గోదావరి పరీవాహక పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల చరిత్రలోనే అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది.
నాగార్జునసాగర్, నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం వంటి ఇతర ప్రాజెక్టులకు సైతం రికార్డు స్థాయి వరదలొచ్చాయి. సాగునీటి రంగ పరిభాషలో జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 మధ్య కాలాన్ని నీటి సంవత్సరంగా పరిగణిస్తారు. 2015–16లో కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు చరిత్రలోనే అత్యల్ప వరదలు రాగా, సరిగ్గా దశాబ్దం తర్వాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు రావడం గమనార్హం.
శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీలు
ప్రస్తుత నీటి సంవత్సరం (2024–25)లో ఇప్పటి వర కు శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీల భారీ వరద వచ్చింది. ఈ ప్రాజెక్టుకు అత్యధికంగా 1994– 95లో 2,039.23 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఆ తర్వాత 2022–23లో దానికంటే స్వల్ప అత్యధికతో 2,039.87 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశై లం జలాశయం నిర్మాణం 1960లో ప్రారంభించగా 1980 జూలై 26న నిర్మాణం పూర్తయ్యింది. 1984–85 నుంచి జలాశయంలో పూర్తిస్థాయి నిల్వలను కొనసాగిస్తున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.
సాగర్‌కూ నాలుగో అత్యధిక వరద
ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు సాగర్‌కు 1,766.24 టీఎంసీల వరద వచ్చింది. సాగర్ చరిత్రలోనే ఇది నాలుగో అత్యధిక వరద. 1955లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 1967లో పూర్తయిన సాగర్‌కు 1975–76లో అత్యధికంగా 2,639.9 టీఎంసీల వరద వచ్చింది.
ఆ తర్వాతి కాలంలో కృష్ణానదిపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. దీంతో సాగర్‌కు వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. 1978–79లో 1,966.75 టీఎంసీలు, 1994–95లో 1,885.64 టీఎంసీల అత్యధిక వరదలు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గడిచిన 40 ఏళ్లలో సాగర్‌కు అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది.
పులిచింతల జలాశయానికి...
సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయ చరిత్రలో అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. ఈ ఏడాది 1,477.1 టీఎంసీల వరద రాగా, అంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,285.86 టీఎంసీల వరద వచ్చింది.
» ఈ ఏడాది కృష్ణానదికి నిరంతరంగా భారీ వరదలు కొనసాగడంతో ప్రకాశం బరాజ్ నుంచి రికార్డు స్థాయిలో 1,628 టీఎంసీల కృష్ణా జలాలను సముద్రంలో విడుదల చేశారు. 1990–91 తర్వాత ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన అత్యధిక వరద ఇదే కావడం గమనార్హం. ఇంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,331. 55 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు.
గోదావరిలోనూ ....
గోదావరి పరీవాహకంలోని సింగూరు జలాశయానికి 1998–99లో అత్యధికంగా 176.56 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఈ ఏడాది చరిత్రలోనే అత్యధికంగా 230.49 టీఎంసీల వరద వచ్చింది.
» నిజాంసాగర్ ప్రాజెక్టుకు 1983–84లో అత్యధికంగా 328.93 టీఎంసీల వరద వచ్చింది. ఈ ఏడాది నిజాంసాగర్‌కు 306.83 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది.
» శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అత్యధికంగా 1983–84లో 1,168.57 టీఎంసీల వరద రాగా, 1988–89లో 928.18 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది. ఈ ఏడాది జలాశయానికి 927.40 టీఎంసీల మూడో అత్యధిక వరద రావడం గమనార్హం.
» శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 1,444.22 టీఎంసీల వరద ఈ ఏడాదే వచ్చింది. 2022–2023లో జలాశయానికి అత్యధికంగా 1,235.76 టీఎంసీల వరద రాగా, 2021–22లో 1077.23 టీఎంసీల ప్రవాహం వచ్చింది. 2015–16లో పూర్తయిన ఈ ప్రాజెక్టు చరిత్రలో ఏడాదికి 1,000 టీఎంసీలకు పైగా వరద మూడు పర్యాయాలు మాత్రమే వచ్చింది.
» ధవళేశ్వరం బరాజ్ నుంచి ఈ ఏడాది 4,428 టీఎంసీల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలారు.


