
గిరిజన సంక్షేమ శాఖలో ఈఎన్‌సీ శ్రీనివాస్ అక్రమాల బాగోతం ఇదీ
జిల్లా అధికారులకు రూ.5 కోట్ల టార్గెట్
కాంట్రాక్టు సంస్థ నుంచి మరో రూ.5 కోట్లు డిమాండ్
బాధితుల ఫిర్యాదుతో ఏసీబీకి చిక్కిన ఈఎన్‌సీ శ్రీనివాస్
కీలక మంత్రి అండతో యథేచ్ఛగా అవినీతి
పెండింగ్ అవినీతి కేసులను జూలై 31న ఉపసంహరించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ‘రిటైర్మెంట్ తరువాత పునరి్నయామకం కావాలి.. అందుకు మంత్రిగారికి రూ.10 కోట్లు ఇవ్వాలి... అందుకే ఈ బలవంతపు వసూళ్లు..!’ గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి తిమింగలంగా ముద్రపడిన ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) సబ్బవరం శ్రీనివాస్ అవినీతి వ్యవహారాలివీ! కీలక మంత్రి అండతో యథేచ్ఛగా అవినీతికి పాల్పడే ఈ ఉన్నతాధికారి ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు. అనంతరం సర్విసు పొడిగించేందుకు కీలక మంత్రితో రూ.10 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై గతంలో నమోదైన అవినీతి కేసులను ఆ మంత్రి సిఫార్సుతో ఇటీవల ఉపసంహరించారు.
ఇక మిగిలింది సర్విసు పొడిగింపు ఉత్తర్వులే. అందుకోసం మంత్రికి ముడుపులు చెల్లించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు రూ.5 కోట్లు టార్గెట్ విధించగా కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. మొదటి విడతగా రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఈఎన్‌సీ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు ఇటీవల రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖవర్గాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ అవినీతి బాగోతం ఇలా ఉంది...
రూ.5 కోట్లు లంచం డిమాండ్... రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఈఎన్‌సీ
రాష్ట్ర చరిత్రలో తొలిసారి రూ.5 కోట్ల భారీ లంచం డిమాండ్ చేయడం ద్వారా గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ సబ్బవరపు శ్రీనివాస్ అక్రమాల్లో కొత్త రికార్డు సృష్టించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్మాణ పనులు చేసిన శ్రీసత్యసాయి కన్‌స్ట్రక్షన్స్ నుంచి ఆయన రూ.5 కోట్లు భారీ లంచం డిమాండ్ చేశారు. ఆ సంస్థకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటే డబ్బు ఇవ్వాల్సిందేనన్నారు. అంత భారీ మొత్తం ఇచ్చుకోలేనని సంస్థ మేనేజింగ్ పార్టనర్ చెరుకూరి కృష్ణంరాజు పేర్కొనగా డబ్బులిస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని తేల్చి చెప్పారు.
దాంతో ఈఎన్‌సీ శ్రీనివాస్ తీరుపై ఆయన విజయవాడ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు సూచించిన ప్రకారం ఈఎన్‌సీ శ్రీనివాస్‌కు ఆయన కార్యాలయంలో చెరుకూరి కృష్ణంరాజు ఇటీవల రూ.25 లక్షలు ముట్టజెప్పారు. లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ వల పన్ని ఈఎన్‌సీ శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది.
కీలక మంత్రి అండతో చెలరేగి..
ఈఎన్‌సీ శ్రీనివాస్ గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి తిమింగలంగా గుర్తింపు పొందారు. ‘అచ్చ’ంగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి సామాజిక వర్గానికి చెందిన ఆయన అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు సాగించారు. మంత్రి అండతో ఏఈగా, ఎస్‌ఈగా, ఈఎన్‌సీగా యథేచ్ఛగా అవినీతికి పాల్పడి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవన నిర్మాణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారు. ఉత్తరాంధ్రలో వందల ఎకరాల భూములు, రెండు విద్యా సంస్థలు, లెక్కకుమించి స్థలాలు, ఫ్లాట్లు, బంగారం.. ఇలా ఈఎన్‌సీ శ్రీనివాస్ అక్రమార్జన చిట్టాకు అంతే లేదు. ఆయనపై గతంలోనే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసినా, వెనక్కి తగ్గలేదు.
‘అచ్చంగా’ రూ.10కోట్ల డీల్... అవినీతి కేసులు ఉపసంహరణ
ఈఎన్‌సీ సబ్బవరపు శ్రీనివాస్ ఈ నెలాఖరులో రిటైర్ కానున్నారు. ఆ తరువాత కూ డా తనను ఈఎన్‌సీగా పునరి్నయమించాలంటూ ఆయన కీలక మంత్రిని సంప్రదించారు. ఇందుకు రూ.10 కోట్లు డీల్ కుదిరింది. అయితే రిటైరైన తరువాత పునర్నియమించాలంటే సంబంధిత అధికారిపై అవినీతి కేసులు పెండింగులో ఉండకూడదు. దీంతో కీలక మంత్రి సిఫార్సుతో ఈఎన్‌సీ శ్రీనివాస్‌పై గతంలో నమోదైన ఏసీబీ కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది.
ఈమేరకు జూలై 31న జీవో జారీ కావడం గమనార్హం. ఇక మిగిలింది ఈఎన్‌సీ శ్రీనివాస్‌ను పునరి్నయమిస్తూ సెపె్టంబర్ మొదటి వారంలో జీవో జారీ చేయడమే. ఇందుకోసం కీలక మంత్రికి రూ.పది కోట్లు ముట్టచెప్పేందుకు సిద్ధమైన శ్రీనివాస్ అన్ని జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు టార్గెట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఏసీబీ రంగంలోకి దిగడంతో అడ్డంగా దొరికిపోయారు.