
ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సందర్భంలో దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా వాయవ్య, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయి. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాలు జోరందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
సోమ, మంగళవారాల్లో రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
