
నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాగా, పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటే సూచనలున్నాయని కూడా పేర్కొన్నారు.
