
రెండు రోజులు మోస్తరు వానలు
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, కొమొరిన్, మాల్దీవులు, తూర్పు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించింది. దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజుల్లో విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉంది. మరోవైపు పశి్చమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో కొనసాగుతోంది.
ఈ ఉపరితల ఆవర్తనంలో దక్షిణ కోస్తా నుంచి యానాం వరకూ విస్తరించిన ద్రోణి విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు భిన్న వాతావరణం కొనసాగనుంది. వడగాలులు, రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదుతో పాటు ఈదురుగాలులు, వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు.
ఈనెలాఖరుకు వేసవి ముగింపు
ఈనెల నాలుగో వారం నాటికి రాష్ట్రంలో ఎండాకాలం దాదాపు ముగిసి పోయినట్లేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26 నుంచి రాయలసీమ అంతటా, 29 తర్వాత రాష్ట్రమంతటా చల్లని వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా జల్లులతో కూడిన వర్షాలు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు.
నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన
రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 4.9 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా డిజిపేటలో 4.7, కర్నూలులో 4.6, చిత్తూరు జిల్లా ముత్తుకూరు 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 41.3 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, పల్నాడు జిల్లా రావిపాడులో 40.3, ఏలూరు జిల్లా ఎస్.రాఘవపురంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.