
కోరిన కోర్కెలు తీర్చే తల్లీ..పోలేరమ్మా.. కాపాడగరావమ్మా.. అంటూ భక్తజనం పోలేరమ్మ ఎదుట ప్రణమిల్లారు. జాతర సందర్భంగా వెంకటగిరి పురవీధులన్నీ స్వర్ణకాంతులతో దేదీప్యమానంగా కాంతులీనాయి.

అమ్మవారి ప్రతిరూపాన్ని తనివితీరా దర్శించుకున్న భక్తులు పులకించారు. అమ్మలుగన్న అమ్మా.. పోలేరమ్మా తల్లీ అంటూ పట్టణ పురవీధుల్లో ప్రతిధ్వనించాయి.

వెంకటగిరి పట్టణమంతా జైపోలేరూ.. జైజై పోలేరూ తల్లీ అంటూ మార్మోగింది. జిల్లా నలుమూలలే కాకుండా దేశవిదేశాల నుంచి కూడా పోలేరమ్మ జాతరకు విచ్చేయడంతో దారులన్నీ వెంకటగిరివైపే మళ్లాయి. దీంతో ఎక్కడ చూసినా జనమే దర్శనమిచ్చారు.

భక్తజన సందోహం నడుమ నగరోత్సవం ప్రారంభం కాగా భక్తులు పెద్దఎత్తున వీక్షించారు.














