అభాగ్యులకు అండగా..

Hassle free certificates in Jagananna Suraksha - Sakshi

జగనన్న సురక్షలో ఇబ్బందుల్లేకుండా సర్టిఫికెట్లు

సాక్షి, నెట్‌వర్క్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వృద్ధాప్యంలో ఉన్నవారికి, కావాల్సిన ధ్రువపత్రాలు ఎలా తెచ్చుకోవాలో తెలియని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం అండగా నిలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిబిరాలు ఉత్సాహంగా జరిగాయి. ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు ధ్రువపత్రాలు కావాల్సిన వారు ఈ కార్యక్రమం ద్వారా సులువుగా వాటిని అందుకున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం అవుతుండటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రెండేళ్ల సమస్యకు పరిష్కారం
ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు బి.కేశమ్మ. అనంతపురం జిల్లా గుంతకల్లు బీటీ పక్కీరప్ప కాలనీలో నివాసం ఉంటోంది. కేశమ్మ భర్త నాగన్న 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. వైఎస్సార్‌ హయాం నుంచీ ఆమెకు వితంతు పింఛన్‌ అందేది. కానీ రెండేళ్ల క్రితం కేశమ్మ రేషన్‌కార్డుకు కర్నూలులోని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆధార్‌ నంబర్‌ లింక్‌ అయ్యింది. దీంతో ఆమె పింఛన్‌ ఆగిపోయింది.

‘జగనన్న సురక్ష’ సర్వేలో భాగంగా వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చిన వార్డు కౌన్సిలర్‌ మెహరున్నీసా, వలంటీర్‌లకు కేశమ్మ సమస్య చెప్పింది. ఆమె రేషన్‌కార్డుకు మరొకరి ఆధార్‌ లింక్‌ అయి ఉందని గుర్తించారు. ఆ తర్వాత రేషన్‌కార్డుకు అనుసంధానమైన తప్పుడు ఆధార్‌ నంబర్‌ను తొలగించారు.

ఆ వెంటనే పింఛన్‌ కోసం దరఖాస్తు స్వీకరించి మంజూరు చేయగా, వలంటీర్‌ ఈ నెల 1వ తేదీనే వైఎస్సార్‌ పింఛన్‌ కానుక మొత్తం కేశమ్మకు అందజేశారు. దీంతో ఆమె ఆనందోత్సాహంలో మునిగిపోయింది. అధికారులను తన ఇంటివద్దకే పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎంకు కేశమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

నిరక్షరాస్యులకు ఎంతో మేలు
ఈవిడ పేరు గడ్డం మార్తమ్మ. బా­పట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవా­రిపాలెం గ్రామం. చదువు లేని కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో అవసరమైన పనులు చేయించుకోవాలంటే ఏమి తెలియని పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా ఎవరో ఒకరి సాయంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది.

ప్రస్తుతం జగనన్న సురక్ష పథకం ద్వారా వలంటీర్లు, సచివాలయ సిబ్బందే ఇంటికి వచ్చి ఆమెకు ఎటువంటి ఇబ్బందిలేకుండా కుల ధ్రువీ­కరణ పత్రం అందజేశా­రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మాలాంటి నిరక్షరా­స్యులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. సర్టిఫికెట్‌ ఇంటికే తెచ్చి ఇవ్వడం గతంలో ఎప్పుడూ లేదు. జగనన్న  ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని సంతోషం వ్యక్తం చేసింది. 

ఒక్కరోజులోనే కుటుంబ విభజన సర్టిఫికెట్‌
ఇతని పేరు శర్మాస్‌ వలి. అనంతపురం జిల్లా కూడేరు గ్రామం. ఏడాది క్రితం వివాహమైంది. దీంతో తన భార్య ఆధార్, తన ఆధార్‌లతో నూతన రేషన్‌ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కుటుంబ విభజన ప్రక్రియ చేయడానికి ఆప్షన్‌ లేక కొత్తగా రేషన్‌ కార్డు పొందలేకపోయాడు.

జగనన్న సురక్షలో భాగంగా వలంటీర్‌ ఇంటికి వచ్చినపుడు శర్మాస్‌ వలి తన సమస్య చెప్పాడు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించిన వలంటీర్‌.. సచివాలయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. అధికారులు వెంటనే అనుమతి ఇవ్వగా, ఆ మరుసటిరోజే వలంటీర్‌ కుటుంబ విభజన సర్టిఫికెట్‌ తీసుకువచ్చి అందించారు. దీని ఆధారంగా శర్మాస్‌ వలి నూతన రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేశారు. 

దరఖాస్తు చేసిన రోజేకౌలు రైతు గుర్తింపుకార్డు 
నేను రెండు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను. గతంలో కౌలు గుర్తింపు కార్డు కావాలంటే దరఖాస్తు చేసిన 10 రోజులకు ఇచ్చేవారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసిన రోజే కౌలు గుర్తింపు కార్డు (సీసీఆర్‌సీ) అందజేయడం ఆనందంగా ఉంది. ఇంటింటికీ వచ్చి ప్రజలకు ఏమి కావాలో అడిగి మరీ సర్టిఫికెట్‌లు ఇచ్చే పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. – సుంకరి గురువులు, కౌలు రైతు, గంట్యాడ, విజయనగరం జిల్లా  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top