వైఎస్సార్‌ సీపీ గుంటూరు కార్పొరేటర్‌ రమేష్‌గాంధీ మృతి

Guntur: YSRCP Corporator Padarthi Ramesh Gandhi Died Due To Illness - Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు, ఆరో డివిజన్‌ కార్పొరేటర్‌ పాదర్తి రమేష్‌గాంధీ గురువారం మృతిచెందారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్‌ పార్టీ యువజన నేతగా ఎదిగిన రమేష్‌గాంధీ జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుతెచ్చుకు న్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా గుంటూరు నగరంలో ఆయన సమక్షంలో రమేష్‌గాంధీ వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆరో డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు.  

మేయర్‌ పీఠం అధిష్టించకుండానే.. 
జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాథరాజు మేయర్‌ ఎన్నికకు ముందు పార్టీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో పాదర్తి పార్టీ నేతలు, కార్పొరేటర్లను ఆప్యాయంగా పలుకరించారు. ఆ సమావేశంలో మేయర్‌ పీఠాన్ని కావటి మనోహర్‌నాయుడు, పాదర్తి రమేష్‌ గాంధీకి చెరో రెండున్నరేళ్లు చొప్పున కేటాయిస్తున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు ప్రకటించారు. ఆ సమావేశం నుంచి కార్పొరేటర్లు అందరూ కార్పొరేషన్‌కు చేరుకుని ప్రమాణ స్వీకారం చేశారు. పాదర్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లారు. కావటి తరువాత మేయర్‌ పీఠాన్ని అధిష్టించకుండానే పాదర్తి అకాల మరణం చెందారు. పాదర్తి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తొలుత చెప్పినప్పటీకీ, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌కు గురికావడంతో అపోలో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.  

వైఎస్సార్‌ సీపీ నేతల సంతాపం
రమేష్‌గాంధీ ఇక లేరన్న విషయం తెలిసిన వైఎస్సార్‌ సీపీ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. మంచి వ్యక్తి, అజాత శత్రువును కోల్పోయా మని జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంచి మిత్రుడిని కోల్పోయానని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ కోసం ఎంతోకష్టపడిన రమేష్‌ గాంధీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు.

రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసన సభ ఉపసభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు), మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్పొరేటర్‌లు, డివిజన్‌ అధ్యక్షులు తదితరులు పాదర్తి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాదర్తి రమేష్‌ గాంధీ అంతిమయాత్ర శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక సాంబశివరావుపేటలోని పాదర్తి కార్యాలయం నుంచి ప్రారంభమవుతుందని పార్టీ నేతలు తెలిపారు.   

చదవండి: తీర్మానాలు చించేశారు.. కుర్చీలు విసిరేశారు..
పరిషత్‌ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top