పరిషత్‌ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు

TDP Leaders Attack On YSRCP Leaders And Activists - Sakshi

పలు జిల్లాల్లో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

టీడీపీ, జనసేన దాడుల్లో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు

శివరామపురంలో వైఎస్సార్‌సీపీ చీఫ్‌ ఏజెంట్‌ కారుపై గొడ్డలితో దాడి

రాజువారిపేటలో బ్యాలెట్‌ పేపర్‌ లాక్కున్న టీడీపీ అభ్యర్థి అరెస్ట్‌

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: పరిషత్‌ ఎన్నికల పోరులో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బరితెగించాయి. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించినా పలుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. అనేకచోట్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారు. ఓటింగ్‌ సమయంలోను ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దౌర్జన్యకాండను కొనసాగించారు.

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరామపురంలో వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సోదరుడు, జెడ్పీటీసీ చీఫ్‌ ఏజెంట్‌ మద్దిశెట్టి రవీంద్ర కారుపై టీడీపీ వర్గీయులు గొడ్డలి, బండలతో దాడిచేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తుర్లుపాడు మండలం పోతలపాడులో ఏజెంట్ల మధ్య వివాదంతో కొద్దిసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. పరిస్థితిని చక్కదిద్దడంతో పోలింగ్‌ జరిగింది. ఇదే జిల్లాకు చెందిన చెరుకూరు ఎంపీటీసీ–1 బ్యాలెట్‌ పత్రాలు వేరే కేంద్రానికి పంపడంతో అవి వచ్చే వరకు కొద్ది సమయం పోలింగ్‌ నిలిచిపోయింది.

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో పోలింగ్‌ బూత్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్త నల్గొండ రమణకు చెయ్యి విరగ్గా, మరో కార్యకర్త నల్గొండ శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి దాడిచేస్తున్న వారిని తరిమికొట్టారు. తరువాత టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పోలింగ్‌ బూత్‌ వద్దకు దూసుకురాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ దాడికి సంబంధించి టీడీపీకి చెందిన సతీష్, మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెదనందిపాడు మండలం రాజుపాలెంలో టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ మండల కన్వీనర్‌ పి.ప్రకాశరావు, మరొక కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా గార్రాజు చీపురుపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బగ్గు చంద్రశేఖర్‌ తన అనుచరులతో కలిసి మెట్టవలస ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి దాటాక డబ్బులు పంచుతుండగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 10 మంది గాయపడ్డారు. వారిని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతకవిటి మండలం తాలాడలో ఓటరు స్లిప్‌లలో వ్యత్యాసం కారణంగా గందరగోళం ఏర్పడి కొద్దిసేపు పోలింగ్‌ నిలిచిపోయింది.

వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం రాజువారివారిపేట పోలింగ్‌ కేంద్రంలో ఒక వృద్ధురాలు సిబ్బంది సాయంతో ఓటు వేసింది. ఆమె ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసిందని టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పి.రాజేశ్వరి ఆ బ్యాలెట్‌ పత్రాన్ని లాక్కుని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమెను ఎన్నికల సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైస్సార్‌సీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ అభ్యర్థి రాజేశ్వరిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం వాసుదేవాపురంలో ఓటింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, ఎంపీటీసీ అభ్యర్థి ఎస్‌ఏ నారాయణరెడ్డి వాహనంపై టీడీపీ నేతలు రాళ్లతో దాడికి తెగబడ్డారు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం కొటాలలో ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్‌సీపీ నేతలు గుర్తించి అడ్డుకున్నారు

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో గురువారం తెల్లవారుజామున టీడీపీ, జనసేన కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్‌సీపీ వారు అడ్డుకున్నారు. దీంతో వారు దాడిచేయడంతో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడినవారిని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

విజయనగరం జిల్లా ద్వారపూడి పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్ల స్లిప్పుల పంపిణీ విషయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై కూన రవికుమార్‌ వర్గీయుల దాడి
పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనబర్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళీకృష్ణపై కూన రవికుమార్‌ వర్గీయులు గురువారం దాడికి పాల్పడ్డారు. పరిషత్‌ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో మరణాయుధాలు, కర్రలతో దాడులు చేసి వీరంగం సృష్టించారు. ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళీ, అతని భార్య సర్పంచ్‌ ఝాన్సీరాణి ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు.

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి చల్లా సుబ్బారావు అనే కార్యకర్త పోలింగ్‌బూత్‌ ఏజెంటుగా నమోదు చేసుకోగా.. అతనిపై 7వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్పృహ కోల్పోయిన సుబ్బారావును స్థానికులు  ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుబ్బారావు చికిత్స పొందుతున్నాడు.

గుంటూరు జిల్లా కారుచోలలో ఉద్రిక్తత 
యడ్లపాడు(చిలకలూరిపేట): గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో టీడీపీ వర్గీయుల కవ్వింపు చర్యలతో గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య  ఘర్షణ జరిగింది. పోలింగ్‌ ప్రక్రియ ముగిశాక గ్రామంలోని బొడ్డురాయి సెంటర్‌లో టీడీపీ వర్గీయులు రాళ్లు, కూల్‌డ్రింక్‌ సీసాలు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన ముగ్గురు కూడా గాయపడ్డారు. చిలకలూరిపేట రూరల్‌ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు, నాదెండ్ల పట్టణ ఎస్సైలతోపాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 144 సెక్షన్‌ అమలు చేసి అల్లర్లు చెలరేగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చదవండి:
బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్‌చల్‌ ‌ 
మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top