తిరుపతమ్మని ఎవరు చంపి ఉండొచ్చు?  | Guntur Women Incident At DGP Office, Police Recover Incriminating Material | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మని ఎవరు చంపి ఉండొచ్చు? 

Published Tue, Mar 25 2025 7:51 AM | Last Updated on Tue, Mar 25 2025 10:03 AM

Guntur Women Incident At DGP Office

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్‌కు వచ్చే జంక్షన్‌లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు  మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. 

రాత్రి 9 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన    వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్‌ స్క్వాడ్‌ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు.  తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్‌స్కా్వడ్‌ వచ్చింది. అప్పటికే ఘటనా స్దలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్‌బ్యాగ్, అమెరికన్‌ క్లబ్‌ సిగరెట్‌ పెట్టెలను తీసివేయడంతో డాగ్‌ స్క్వాడ్‌ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. 

చివరకు ఎస్పీ సతీష్‌కుమార్‌ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు  ఇంత నిర్లక్ష్యంగా    వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.    

ఎవరు చంపి ఉండొచ్చు? 
జెస్సీ, నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా  కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదలలో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సి, నజీరా లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి వున్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్‌ చేశారు. 108 సిబ్బంది రావడంతో లక్ష్మీ తిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.  

అనాథలుగా పిల్లలు  
లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని రోధించారు. పిల్లలను ప్రభుత్వం సంరక్షించాలని విన్నవించారు.

హతురాలు పామర్రు వాసి.. 
తాడేపల్లి రూరల్‌: డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన హత్యాచారం కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీ‹Ùకుమార్‌ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీ‹Ùకుమార్, లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు విజయవాడకు చెందిన సీసీఎస్‌ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.  

పామర్రు స్వగ్రామం.. 
మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మీ తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త అయిన నవీన్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని ఆమెకు చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం  ట్రాన్స్‌జెండర్‌ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్‌జెండర్‌ నజీరాతోనూ తిరుపతమ్మకు పరిచయం అయింది. వీరిద్వారా తిరుపతమ్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్‌కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడినీ అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది.

వీడియోలు, రీల్స్‌..  
హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ విస్తృతంగా జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీ తిరుపతమ్మ, మరికొంతమంది మహిళలు రీల్స్, ఇంస్టాగ్రామ్ లో పాటలు పాడుతూ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement