రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్లను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయం చుట్టూ రైతులు తమ పశుసంపదను ప్రదక్షణలు చేయించారు. భక్తులు పొంగళ్లు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు. వీరబ్రహ్మేద్రస్వామి వారి భజన కార్యక్రమాలు చేశారు. రాత్రికి గ్రామస్తులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు బండి మల్లేశం నిర్వహించారు. పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
పెదపులివర్రు(భట్టిప్రోలు): శ్రీ భూ–నీళా సమేత శ్రీ వరద రాజ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం స్వామి వార్లకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం, బలిహరణ జరిగింది. రాత్రి మూజు వాణి కార్యక్రమం నిర్వహించారు. రాత్రి కార్యక్రమంలో భాగంగా దివ్య రథోత్సవం జరిగింది.
తెనాలి: స్థానిక బాలాజీరావుపేటలోని అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవాలు, ఫాల్గుణ పౌర్ణమి దుర్గమ్మ తిరునాళ్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. గత రెండురోజులుగా దుర్గమ్మ అమ్మవారు పసుపుగౌరి అలంకారంతో నగర సంచారం జరిగింది. ఈ క్రమంలో తిరునాళ్ల రోజు ఉదయం భక్తులు పాలపొంగళ్లు చేసి అమ్మవారికి సమర్పించి, పసుపు గౌరీ దర్శనం చేసుకున్నారు కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించారు. దోగిపర్తి వారి కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో ఏటా జరిగినట్టే ఈసారీ జరిపారు. అనంతరం నృత్యప్రదర్శనలు జరిగాయి.
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు, భక్తులు దాదాపు ఐదు వేల మందికిపైగా పాల్గొని ప్రతిష్ఠామహోత్సవ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


