తాడేపల్లి రూరల్ : మంగళగిరి రూరల్ పరిధిలోని యర్రబాలెం గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తోలే ట్రాక్టర్ యజమానులు ఓ వృద్ధుడిపై రెచ్చిపోయారు. ఆయనపై దాడి చేయడంతో సోమవారం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు.. బాధితుడు డోనె సాంబశివరావు తెలిపిన వివరాల ప్రకారం.... ఱ‘మాకు పెనుమాక రోడ్డులో కొంత భూమి ఉంది. ఆ భూమి పక్కనే మరో ప్లాట్ యజమాని నల్లమట్టిని లారీల ద్వారా తోలించుకున్నాడు. నేను కూడా అదే లారీలతో మట్టి తోలించుకుంటుంటే యర్రబాలెంకు చెందిన నాయుడు వెంకటరత్నం నా స్థలం వద్దకు వచ్చి మట్టి ఎవరిని అడిగి తోలుకుంటున్నావు? తోలితే మేమే తోలాలి. ప్లాట్‌లో మట్టి తోలుతున్న లారీలను అడ్డుకుని గొడవ చేశాడు. ఇదేంటని ప్రశ్నించగా వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా చేతితో నెట్టి కింద పడేసి తొక్కేస్తానంటూ బెదిరించాడు. మట్టిరేటు ఎక్కువగా ఉందని, తక్కువగా వస్తోందని వేరే చోట తోలించుకుంటున్నాని చెప్పినా దుర్భాషలాడారు. నియంతృత్వంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే విషయం అర్థం కావడం లేదు. రాజధాని చెరువు తవ్వకాల్లో వచ్చిన మట్టిని ఎవరికై నా తోలించుకోవచ్చంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ మాత్రం ట్రాక్టర్ యజమానులు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఒక ట్రాక్టర్ మట్టిని రూ.వెయ్యి నుంచి రూ. రెండు వేల వరకు విక్రయిస్తున్నారు. మాకు లారీ మట్టి రూ.5 వేలకు వస్తోంది. తోలించుకోవద్దని చెప్పడానికి వెంకటరావు ఎవరు.? జరిగిన సంఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. ఫిర్యాదు చేసిన వెంటనే అదే గ్రామానికి చెందిన ఓ నాయకుడు పోలీసులతో మంతనాలు జరిపి మట్టితోలే ట్రాక్టర్ యజమానులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయం జరగకపోతే మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తా’’ బాధితుడు ఆరోపించాడు.


