ప్రకటనల మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

ప్రకటనల మాయాజాలం

Mar 3 2026 8:16 AM | Updated on Mar 3 2026 8:16 AM

ప్రకటనల మాయాజాలం

డివైడర్‌ మధ్యలో లాలీపాప్స్‌ (యాడ్‌ బోర్డ్‌) తీసేయాలని ఆదేశం గత కమిషనర్‌ హయాంలో బోర్డులను తొలగించిన సిబ్బంది కొత్త కమిషనర్‌ విధుల్లో చేరగానే తిరిగి బోర్డులు ఏర్పాటు ప్రైవేట్‌ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తున్న కార్పొరేషన్‌ ఆదాయం

నెహ్రూనగర్‌ : గతంలో డివైడర్ల మధ్యలో లాలీపాప్స్‌ ఉండేవి. వీటికి నగరపాలక సంస్థ ద్వారానే విద్యుత్‌ సరఫరా వసతి తీసుకునే వారు. వీటి మీద నెలకు రూ.వేల నుంచి రూ.లక్షల వసూలు చేస్తుండేవారు. వీటి నిర్వహణకు సంబంధించి నగరపాలక సంస్థకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో రూ.కోట్ల బకాయిలు పడుతుండేవి. వాటిని మాఫీ చేసేందుకు పట్టణ ప్రణాళిక అధికారులు గతంలో పనిచేసిన యాడ్‌ ఏజెన్సీ పేరుతో కాకుండా మరో పేరుతో తిరిగి కొత్తగా ప్రకటనలు వేయించేలా పావులు కదిపేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో గుంటూరు నగరంలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా డివైడర్ల మధ్యలో లాలీపాప్స్‌ గత కమిషనర్‌ పులి శ్రీనివాసులు హయాంలో తొలగించారు. శ్రీనివాసులు బదిలీ కావడంతో కమిషనర్‌గా మయూర్‌ అశోక్‌ విధుల్లో చేరారు. దీంతో యాడ్‌ ఏజెన్సీలు రాత్రికి రాత్రే లాలీపాప్స్‌ నగరం అంతా ఏర్పాటు చేయించాయి.

గ్యాంట్రీ హోర్డింగ్స్‌లోనూ...

నగరంలో పలు ప్రధాన కూడళ్లలో గ్యాంట్రీ(క్రేన్‌) హోర్డింగ్స్‌కు 35కి మాత్రమే అనుమతి ఉంది. యాడ్‌ ఏజెన్సీలు అధికారుల అండదండలతో 40 వరకు ఏర్పాటు చేశాయి. వీటికి ఈ మధ్య ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేసి మరి దోపిడీకి తెరతీశారు. ఏటా రూ.కోట్ల ఆదాయం కాంట్రాక్టర్లు సమకూర్చుకుంటున్నా కార్పొరేషన్‌కు నామమాత్రంగా చెక్కులు ఇస్తున్నారు. అవి కూడా జీఎంస్‌ ఖాజానాకు చేరాయో లేదో తెలియని పరిస్థితి. గ్యాంట్రీ బోర్డుల నిర్వహణలో జరుగుతున్న లోపాలను కౌన్సిల్‌ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవిలు ప్రశ్నించినప్పటికీ ఎలాటి ఫలితం లేకుండా పోయింది.

రూ.కోట్లలో ఎగనామం

ఒక్కో గ్యాంట్రీ బోర్డుకు నెలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఏటా ఒక్కో బోర్డుకు రూ.3.50 లక్షలు జీఎంసీకి చెల్లించాలని ఒప్పందం. కానీ సదరు ఏజెన్సీ నిర్వాహకులు కేవలం 20 బోర్డులకు మాత్రమే ట్యాక్స్‌ కడుతున్నట్లు తెలుస్తోంది. 40 బోర్డులకు రూ.1.40 కోట్లు ప్రతి సంవత్సరం కట్టాలి. నగర కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ను వివరణ కోరగా నిబంధనలకు విరుద్ధంగా బోర్డులు ఉంటే తొలగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement