వైభవంగా నృసింహుని కళ్యాణమహోత్సవం భారీగా తరలి వచ్చిన భక్తజనం అశ్వవాహనంపై దర్శనమిచ్చిన నారసింహుడు
నేడు నృసింహుని ఆలయం మూసివేత
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం నృసింహుని దివ్య కళ్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి అట్టహాసంగా జరిగింది. సోమవారం ఉదయం అశ్వవాహనంపై విహరిస్తూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించారు. అశ్వవాహనంపై స్వామిని దర్శించినవారికి జ్ఞానవృద్ధి, విద్యాభివృద్ధి కలుగుతుందని భక్తులకు అర్చకులు వాహన విశిష్టతను వివరించారు. కొబ్బరి కాయలు కొట్టి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారు కళ్యాణ వేదిక వద్దకు వచ్చే సమయంలో ఎదురుకోలు ఉత్సవం నిర్వహించారు. రంగురంగుల పూలతో కళ్యాణ వేదికను అలంకరించి స్వామివారిని అధిష్టింపజేశారు. అర్చకులు స్వామి దివ్య కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా కనుల విందుగా జరిపించారు. స్వామి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశించారు. అశ్వవాహన ఉత్సవానికి నిడమర్రు గ్రామానికి చెందిన మండేపూడి పానకాల రావు, రూపకళ కై ంకర్య పరులుగా వ్యవహరించగా, కళ్యాణమహోత్సవానికి శాశ్వత కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన వాసిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ వ్యవహరించారు. పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం తరఫునన అవ్వారు వాచ్ కంపెనీ అధినేత శరత్‌బాబు మధుపర్కాలు, మంగళ ద్రవ్యాలు సమర్పించారు. ఉత్సవాలకు ఆలయ ఈవో కె. సునీల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించగా మంగళగిరి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ, దిగువ సన్నిధితో పాటు ఉపాలయాలను కూడా ద్వారబంధనం చేయనున్నామని, తిరిగి బుధవారం గ్రహణ శుద్ధి అనంతరం ఉదయం 7 గంటలకు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


