కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న శాలివాహనులు
సతీష్ కుమార్ సోదరుడు హరికుమార్
ముప్పు ఉందని తెలిసీ రక్షణ కల్పించలేదని ఆవేదన
కర్నూలు (సెంట్రల్): టీటీడీ పూర్వ ఏవీఎస్‌వో, రైల్వే సీఐ సానా సతీష్ కుమార్ భద్రతపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా రక్షణ కల్పించకపోవడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని ఆయన తమ్ముడు హరికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తామున్నామంటూ అందరూ వచ్చి సానుభూతి వ్యక్తం చేస్తున్నారని పరోక్షంగా టీడీపీ నాయకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
ఆయన బతికుండగా సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించిందో ఎవరూ చెప్పడం లేదన్నారు. సోమవారం శాలివాహన (కుమ్మర) సంఘం ఆధ్వర్యంలో సీఐ సతీష్ కుమార్ మృతిని నిరసిస్తూ కర్నూలు రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన శాలివాహనులు ధర్నా చేశారు.
దర్యాప్తును సీబీఐకి అప్పగించండి
ఈ సందర్భంగా సతీష్ కుమార్ తమ్ముడు హరికుమార్ మాట్లాడుతూ.. ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ పరకామణి కేసులో సాక్షిగా ఉన్న సీఐ సతీష్ కుమార్ భద్రతపై ఇంటెలిజెన్స్ నిఘా ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. శాలివాహన సంఘ నాయకుడు జి.పుల్లయ్య మాట్లాడుతూ.. సీఐ రక్షణపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఆయన దారుణ మరణాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. ఈ ఉదంతాన్ని సీఐలందరూ ఖండించాలని, ఆయన కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరారు.
ప్రభుత్వం ఎక్కడైనా చిన్న ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటుందని, అయితే సీఐ సతీష్ కేసు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందో అర్థం కావడం లేదన్నారు. ఇంతవరకు బాధిత కుటుంబానికి కనీస పరిహారం ప్రకటించలేదని, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్పలేదని తప్పు బట్టారు. కేసును సీబీఐకి అప్పగించాలని, బాధిత కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేíÙయా ఇవ్వాలని, భార్య లేదా ఆయన తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పీబీవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


