20 ఈఎమ్‌ఐలు.. రూ. 300 కోట్లు | Government not giving clearance to ration vehicles | Sakshi
Sakshi News home page

20 ఈఎమ్‌ఐలు.. రూ. 300 కోట్లు

Jun 26 2025 5:22 AM | Updated on Jun 26 2025 5:22 AM

Government not giving clearance to ration vehicles

రేషన్‌ వాహనాలకు క్లియరెన్స్‌ ఇవ్వని ప్రభుత్వం

ఈఎంఐలు కట్టాలంటూ బ్యాంకర్ల నుంచి ఒత్తిళ్లు 

వాహనాలు చేతిలో ఉన్నా ఉపాధి లేక అల్లాడుతున్న నిర్వాహకులు 

ఎన్‌వోసీకి రూ.300 కోట్లు చెల్లించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం

ఖజానాలో డబ్బుల్లేవంటున్నపౌరసరఫరాల శాఖ

వచ్చే నెల నుంచి రోడ్లపైకి వాహనాలు తీసుకొస్తామని హెచ్చరించిన వాహనదారులు

సాక్షి, అమరావతి: ఇంటి వద్దకే రేషన్‌ వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం, రేషన్‌ వాహ­నాలు తిప్పుతున్న వారందరికీ వాటిని ఉచితంగా అందిస్తామని చెప్పింది. కానీ నెల రోజులు గడిచినా ఆ మాట నెరవేర్చలేదు. దీంతో ఓ వైపు ఈఎమ్‌ఐలు కట్టాలంటూ బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు..మరోవైపు ఎన్‌వోసీలు లేక వాహనాలను వినియోగించుకోలేని దైన్యంలో వాహనాల డ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారు. సమస్యను పరిష్కరించకపోతే వచ్చే నెలనుంచి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

9,260 వాహనాలు..20 ఈఎమ్‌ఐలు.. రూ.300 కోట్లు 
గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన సుమారు 9,260 మంది యువతకు సొంత ఊరి­లోనే ఉపాధి కల్పి­స్తూ ఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసింది. ఈ క్రమంలో అన్ని వాహనాలనూ ఉచితంగా అందిస్తామని, వాటిని వ్యాపార కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 

అయితే అప్పటికే  20 ఈఎమ్‌ఐలు ఉండగా, వాటిని తామే కట్టి వాహనాలను ఉచితంగా ఇచ్చేస్తామని మాటిచ్చింది. కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. ఈ వాహనాల ఈఎమ్‌లు పూర్తి చేయాలంటే ప్రభుత్వం బ్యాంకులకు రూ.300 కోట్లు చెల్లించాలి. ఆ మొత్తాన్ని కడితే తప్ప బ్యాంకుల నుంచి వాహనాలకు నిరభ్యంతర ధ్రువీకరణ (ఎన్‌వోసీ)లు దక్కని పరిస్థితి. ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించేంత వరకు రేషన్‌ వాహనాల డ్రైవర్లే ఈఎమ్‌ఐలు కట్టాలంటూ బ్యాంకులు వెంటపడుతున్నాయి.

ఖజానాలో డబ్బుల్లేవు 
ఈ విషయమై రెండు రోజుల కింద రేషన్‌ వాహనాల డ్రైవర్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు విన్నవించగా ‘‘ఖజానాలో డబ్బులు లేవు. ఒక్కసారిగా అంత అమౌంట్‌ కట్టాలన్నా కష్టమే. ఇప్పటి వరకు ఈఎంఐల రూపంలో కడుతున్నాం. దీనినే కొనసాగించాలని ప్రభుత్వం భావి­స్తోంది’’అని చెప్పినట్టు సమాచారం.

ఇక రోడ్లపైకి వస్తాం..
రేషన్‌ వాహనాలను ఉచితంగా ఇచ్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాటిచ్చి నెలదాటినా ఎన్‌వోసీ, క్లియరెన్స్‌ ఇవ్వలేదు. ఇవి లేకుండా వాహనాలను రోడ్లపై ఎలా తిప్పగలం? ఇప్పటికే ఉపాధిని కోల్పోయాం. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెలనుంచి రోడ్లపైకి వస్తాం. – రౌతు సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర రేషన్‌ వాహన డ్రైవర్ల సమాఖ్య 

Advertisement
 
Advertisement
Advertisement