
భీమిలి టీడీపీలో అసమ్మతి సెగ
మినీ మహానాడుకు కోరాడ వర్గం డుమ్మా
మధురవాడ(విశాఖపట్నం): భీమిలి నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడులో పార్టీ నేతల మధ్య అసమ్మతి సెగ బయటపడింది. పీఎంపాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం జరిగిన ఈ సభకు కోరాడ రాజబాబు వర్గం డుమ్మా కొట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కె.బాలాజీ, టీడీపీ నేతలు తొలుత దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభాధ్యక్షత వహించిన 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ముందుగా గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజను నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ పరిశ్రమల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు.
రాజబాబు వర్గం డుమ్మా
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన భీమిలి టీడీపీ ఇన్‌చార్జ్ కోరాడ రాజబాబు, అతని వర్గం ఈ సభకు డుమ్మా కొట్టింది. ఆనందపురం ప్రాంత నాయకులు కూడా అరకొరగానే వచ్చారు. కొంత కాలంగా గంటా, కోరాడ మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు ఈ సభ స్పష్టతనిచ్చింది. సభలో ఏర్పాటు చేసిన బ్యానర్‌లపై కూడా రాజబాబు ఫొటో ఎక్కడా కనిపించలేదు. రాజబాబును నియోజకవర్గ ఇన్‌చార్జిగా అనధికారికంగా ఇప్పటికే తప్పించినట్లు తమ్ముళ్లు గుసగుసలుపోతున్నారు. ఇప్పుడు సభలోనే గంటా రవితేజను ఇన్‌చార్జిగా ప్రకటించేశారు.
స్థానిక కమిటీలపై అసంతృప్తి
పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సీనియర్లకు గంటా వచ్చాక తగిన ప్రా«ధాన్యత దక్కట్లేదన్న విమర్శలున్నాయి. పదవులు, స్థానిక కమిటీల్లో కూడా వారికి చోటు దక్కలేదు. మధురవాడలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో సీనియర్ నాయకులు అసమ్మతి ర్యాలీగా మహానాడుకు తరలి రావడం విశేషం. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదంటూ సంకేతాలు ఇస్తున్నారు.
జోహార్ సీఎం సర్!
గంటా రవితేజ తన ప్రసంగంలో జోహార్ ఎన్టీఆర్.. జోహార్ సీఎం సర్.. జోహార్ లోకేశ్‌బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారు అవాక్కయ్యారు. చనిపోయిన వారికి కదా జోహార్లు అరి్పంచేది అంటూ.. పక్కనే ఉన్న నాయకులు చెప్పడంతో.. పొరపాటున అలా అనేశానంటూ.. వివరణ ఇచ్చుకున్నారు.
