
చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌రావుతో నిందితుడు కిశోర్
చిత్తూరులోని అటవీ శాఖ నగరవనం పార్కులో ఘోరం
ఫారెస్టు ఆఫీసర్లమంటూ బాలిక, స్నేహితుడికి బెదిరింపులు
స్నేహితుడి గొంతుపై కత్తిపెట్టి.. అతని ఎదుటే దారుణం
నిందితులు ముగ్గురూ టీడీపీ కార్యకర్తలే..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక
తొలుత పట్టించుకోని పోలీసులు.. ఆపై దొంగతనం కింద
ఎఫ్‌ఐఆర్ చివరకు గ్యాంగ్ రేప్‌గా కేసు నమోదు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మాటలకందని అమానుషం చోటుచేసుకుంది. నగరంలోని అటవీ శాఖ పార్కులో పట్టపగలు టీడీపీ మూకలు వంతులేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరుగా సాగించిన కీచకపర్వానికి ఓ బాలిక జీవితం బలయ్యింది. స్నేహితుడి గొంతుపై కత్తి పెట్టి.. బాలికను బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. చిత్తూరులో జరిగిన ఈ ఘోరం.. ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది.
ఫారెస్టు ఆఫీసర్లమంటూ బెదిరించి..
ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి సెపె్టంబర్ 25వ తేదీ మధ్యాహ్నం పెనుమూరు క్రాస్‌లోని అటవీ శాఖకు చెందిన నగరవనం పార్కుకు వెళ్లింది. ఇద్దరూ ఓ బెంచీపై కూర్చుని మాట్లాడుకుంటుండగా.. సంతపేటకు చెందిన హేమంత్, మురకంబట్టు అగ్రహారానికి చెందిన మహేశ్, కిశోర్‌తో పాటు మరికొందరు టీడీపీ వర్గీయులు పార్కు లోపలికి వచ్చారు. ఒంటరిగా కూర్చున్న వీరిద్దరి వద్దకు వెళ్లి.. ‘మేము ఫారెస్టు ఆఫీసర్లం. మీకు ఇక్కడేం పని? మీపై మాకు అనుమానం ఉంది. స్టేషన్‌కు పదండి’ అంటూ బెదిరించారు.
తాము స్నేహితులమని.. మాట్లాడుకోవడానికి వచ్చామని చెబుతున్నా వినకుండా.. వారిద్దరినీ పార్కులోని పొదల్లోకి లాక్కెళ్లారు. ప్రతిఘటించిన బాలిక స్నేహితుడిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కడుపుపై తన్ని.. మొహంపై పిడిగుద్దులు గుద్దారు. మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కున్నారు. గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. అరవకుండా అతని నోరు మూసేశారు. అతడి కళ్లెదుటే యువతిపై ఒకరి తర్వాత ఒకరు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరిస్తూ.. దాదాపు రెండు గంటల పాటు కీచకపర్వం సాగించారు. ముగ్గురు లైంగిక దాడికి పాల్పడగా.. మిగిలిన వారు బాలికను అసభ్యకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందినట్లు తెలిసింది. ఆ వెంటనే నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు.

టీడీపీ కండువాతో నిందితులు మహేశ్, హేమంత్
పంచాయితీకి ప్రయత్నించిన టీడీపీ నాయకులు..!
ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు, కార్పొరేటర్.. గుట్టుచప్పుడు కాకుండా పంచాయితీ చేసేందుకు యత్నించినట్లు సమాచారం. జరిగిన ఘోరాన్ని బాలిక స్నేహితుడు.. తన కుటుంబీకులకు చెప్పాడు. దీంతో వారు పార్కు సమీపంలోని హోటల్‌లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి.. 29వ తేదీన నిందితులను పట్టుకున్నారు. వారికి దేహశుద్ధి చేశారు. ఆ సమయంలో నిందితుల ఫోన్లలో ఘటనకు సంబంధించిన ఏడు వీడియోలను గుర్తించినట్లు తెలిసింది.
పట్టించుకోని పోలీసులు..
అంతకుముందు యువకుడి కుటుంబసభ్యులు చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. సీఐ, ఎస్సై అందుబాటులో లేరని అక్కడి సిబ్బంది జవాబిచి్చనట్లు సమాచారం. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బంది సైతం సరిగ్గా పట్టించుకోకపోవడంతో వాళ్లు వెనుదిరిగినట్లు తెలిసింది. నిందితులకు దేహశుద్ధి జరిగిన విషయం బయటకురావడంతో పోలీసులు.. బాలిక స్నేహితుడి నుంచి సోమవారం రాత్రి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
నిందితులు ముగ్గురూ టీడీపీ కండువాలతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌రావు, టీడీపీ నాయకుడు ఎల్‌బీఐ లోకేశ్, కార్పొరేటర్ నవీన్‌తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మంగళవారం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ నాయుడు, సీఐలు శ్రీధర్ నాయుడు, మహేశ్వర మీడియా సమావేశం నిర్వహించారు. బాలిక ఫిర్యాదు మేరకు.. హేమంత్, మహేశ్, కిశోర్ అనే ముగ్గురిపై అత్యాచారం, పోక్సో, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.